Published 03 Jan 2024
ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే రెండు ఇన్నింగ్స్ లు కంప్లీట్… ఏడుగురు బ్యాటర్ల డకౌట్… పేసర్ల ధాటికి 20 వికెట్లు టపటపా… 153 స్కోరు వద్ద ఐదో వికెట్ పడిపోతే అదే స్కోరు వద్ద పదో వికెట్ నేలకూలడం… ఒక ఓవర్లో 3, మరో ఓవర్లో రెండు వికెట్లతో ఇన్నింగ్స్ క్లోజ్… ఇదీ భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టులో జరిగిన వింతలు. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 55 రన్స్ కే ఆలౌటైతే సఫారీ పేసర్లు సైతం తామేం తక్కువ కాదని నిరూపించారు. టీమ్ఇండియా 153 పరుగులకు ఆలౌట్ కావడంతో ప్రత్యర్థిపై కేవలం 98 రన్స్ ఆధిక్యం మాత్రమే సాధించింది. ఒక్క రన్ రాకుండానే చివరి 6 వికెట్లు కోల్పోవడం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
ఏడుగురు సున్నాకే…
జైస్వాల్, శ్రేయస్, జడేజా, బుమ్రా, ప్రసిద్ధ్, ముకేశ్.. ఈ ఆరుగురూ డకౌట్ గా వెనుదిరిగారు. ఎంగిడి, రబాడ విజృంభించడంతో చివరి రెండు ఓవర్లలో ఒక్క రన్ రాకుండానే 5 భారత వికెట్లు నేలకూలాయి. కేవలం 11 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు పడ్డాయి. కోహ్లి(46), రోహిత్(39), గిల్(36) మాత్రమే కొద్దిగా నిలబడ్డారు. భారత్ ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాటర్లు డకౌటైతే, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఒకరు సున్నాకే వెనుదిరగడం ఆశ్చర్యకరంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ల్లో ఏ జట్టు బ్యాటరూ హాఫ్ సెంచరీ చేయకపోవడం, విరాట్ కోహ్లి(46)దే హయ్యెస్ట్ స్కోరు కావడం కేప్ టౌన్ పిచ్ కు నిదర్శనంగా నిలిచింది.
ఇరుజట్లలో పేసర్లదే హవా
నేలకూలిన 20 వికెట్లను పేస్ బౌలర్లే తీసుకున్నారు. భారత్ బౌలర్లలో సిరాజ్ 6, బుమ్రా, ముకేశ్ రెండేసి వికెట్లు తీస్తే… దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లలో ఎంగిడి, బర్గర్, రబాడ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. రెండు ఇన్నింగ్స్ లు అత్యంత త్వరగా ముగియడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. రెండు ఇన్నింగ్స్ లూ కేవలం 58.1 ఓవర్లనే ముగిశాయి. 1902 సంవత్సరం తర్వాత ఇంత త్వరగా తొలి ఇన్నింగ్స్ లు కంప్లీట్ కావడం రికార్డుగా నిలిచింది.