ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవకాశం(Chance) రానే వచ్చింది.. వచ్చిన ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రత్యర్థిని గడగడలాడించాడా పేస్ బౌలర్(Fast Bowler). ఆడుతున్నది అరంగేట్ర(Debut) మ్యాచే అయినా అపార అనుభవమున్న సీనియర్ లా.. బ్యాటర్ల వెన్నులో దడ పుట్టించాడు. అసలే బుమ్రా అందుబాటులో లేడు. అతడు లేని లోటును తీర్చడం సాధ్యమేనా అన్న కామెంట్స్ అంతటా వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తుది జట్టులో చోటు దక్కించుకుని మరీ తొలి టెస్టులోనే అదరగొట్టిన ఆ బౌలరే ఆకాశ్ దీప్. ఆరంభ ఓవర్లలోనే మూడింటికి 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను ఆందోళనకు గురిచేశాడు.
ఆ ఇద్దరిలా బెంగాల్ నుంచే…
ఆకాశ్ 3, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకోవడంతో లంచ్ టైమ్ కు ఇంగ్లండ్.. 5 వికెట్లకు 112 రన్స్ చేసి ఎదురీదుతున్నది. దేశవాళీ క్రికెట్(National Cricket)లో బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆకాశ్. స్టార్ పేసర్ మహ్మద్ షమి, ప్రస్తుతం టీమ్ లో ఉన్న మరో బౌలర్ ముకేశ్ కుమార్ సైతం బెంగాల్ నుంచి వచ్చినవారే. వాస్తవానికి బిహార్ లోని రోహ్తాస్ జిల్లా డెహ్రీ ఆకాశ్ స్వస్థలం. చిన్న వయసులోనే 2010లో బెంగాల్ లోని అతడి మావయ్య వద్దకు చేరుకుని అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ లోనూ…
IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆకాశ్ ఆడుతుండగా.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 30 మ్యాచ్ ల్లో 104 వికెట్లు తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఇంగ్లండ్ లయన్స్ తో ఇండియా-Aకు జరిగిన మ్యాచ్ లో అతడు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. రాంచీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టులోనూ ఇంగ్లండ్ స్కోరు 47 వద్ద రెండు వికెట్లు తీసిన ఆకాశ్.. మరో 10 పరుగుల తర్వాత ఇంకో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లిష్ జట్టు ఆకాశ్ దెబ్బకు 57 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ముఖ్యంగా జాక్ క్రాలీ ఆఫ్ స్టంప్ బెయిల్స్ ఎగురగొట్టిన బంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.