
Published 20 Jan 2024
పొట్టి ఫార్మాట్(T20 Format) ప్రపంచకప్(World Cup)కు ఐదు నెలల సమయం మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను సీమ్ ఆల్ రౌండర్ల కొరత వేధిస్తున్నది. అండగా ఉంటాడనుకున్న హార్దిక్ పాండ్య గాయంతో కొద్ది నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మధ్యలో శార్దూల్ ఠాకూర్ ను పరీక్షించినా పెద్దగా ప్రయోజనం కనపడలేదు. మరి పాండ్య స్థానాన్ని భర్తీ చేసేదెవరు..! ఇన్ని IPL సీజన్లు జరిగినా భారత్ కు అసలు సిసలు ఆల్ రౌండర్ దొరకడం కష్టమేనా..! ఈ ప్రశ్నలకు ఇపుడున్న సమాధానం శివమ్ దూబె. అఫ్గానిస్థాన్ సిరీస్ లో రెచ్చిపోయిన దూబె.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ని అందుకున్నాడు. మంచి ఫినిషర్ గా కనిపిస్తున్న ఈ యువ ప్లేయర్.. వచ్చే వరల్డ్ కప్ కు పాండ్యకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడని మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు.

యువరాజ్ ను గుర్తుకు తెస్తూ…
శివమ్ దూబె సిక్స్ కొట్టినప్పుడల్లా యువరాజ్ సింగ్ తో పోలుస్తున్నారు కామెంటేటర్లు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేయడంలో యువరాజ్ ను మించిన బ్యాటర్ లేరని చెప్పాలి. మొన్నటి అఫ్గాన్ మ్యాచ్ లే కాకుండా 2023 IPL సీజన్లోనూ దూబె అద్భుతంగా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి బరిలోకి దిగి 22 సిక్సర్లు బాదాడు. ఇందులో మిడిల్ ఓవర్ల(7-16)లోనే 20 సిక్స్ లు కొట్టడం చూస్తే అతడి ధాటి ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బెస్ట్ స్ట్రైక్ రేట్ లో మూడో స్థానంలో నిలిచిన దూబె.. హెన్రిచ్ క్లాసెన్(185.34), సంజూ శాంసన్(172.17) కంటే కాస్త వెనకున్నాడు. సిక్స్ ల పరంగా చూస్తే ఈ ఇద్దరి కంటే ముందున్నాడు శివమ్. ప్రతి 111 బంతులకు 16 నుంచి 18 సిక్స్ లు ఈ లెఫ్ట్ హ్యాండర్ అకౌంట్లో ఉంటే.. ఇందుకు క్లాసెన్(116), శాంసన్(115) బాల్స్ తీసుకున్నారు. మొన్నటి IPLలో 3 నుంచి 6వ స్థానంలో బ్యాటింగ్ దిగిన దూబె.. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత చెన్నై తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ధోని డైరెక్షన్ లో…
2019లో అరంగేట్రం చేసిన దూబె.. నేషనల్ క్రికెట్ లో రాణించినా అంతర్జాతీయ స్థాయిలో తన మార్క్ చూపించలేకపోయాడు. పాండ్యకు బ్యాకప్ గా మాత్రమే ఇంతకాలం భావించడంతో సెలెక్టర్లు పెద్దగా అతణ్ని లెక్కలోకి తీసుకోలేదు. కానీ ధోని సారథ్యంలో రాటు దేలిన ఈ ఆల్ రౌండర్.. గత రెండేళ్ల నుంచి బాగా ఆడుతున్నాడు. షార్ట్ పిచ్ బంతుల వీక్నెస్ ను అధిగమించి పొట్టి ఫార్మాట్ లో తానేంటో నిరూపించుకున్నాడు. అఫ్గాన్ తో తొలి రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టి వచ్చే వరల్డ్ కప్ లో పాండ్యకు తానే ప్రత్యామ్నాయ(Alternative)మని నిరూపించాడు. ఇండోర్ మ్యాచ్ లో 7 బాల్స్ లో 14 రన్స్ తో ఉన్న దూబె.. కేవలం మరో 15 బంతులకే ఇంకో 36 పరుగులు చేసి మొత్తం 22 బాల్స్ లోనే 50 పూర్తి చేసి ఔరా అనిపించాడు. మహ్మద్ నబీ బౌలింగ్ లో కంటిన్యూగా మూడు సిక్స్ లు బాదిన తీరు నిజంగానే యువరాజ్ ను గుర్తుకు తెచ్చింది. మిడిల్ ఓవర్లలో స్పిన్ ను సమర్థంగా ఆడే శివమ్ పైనే సీమ్ ఆల్ రౌండర్ ఆశలు ఉన్నాయని మాజీలు అంటున్నారు. అతడు కచ్చితంగా వచ్చే వరల్డ్ కప్ లో కీలక ఆటగాడు అవుతాడంటున్నారు.
Read Also : వారెవ్వా… ‘సూపరో సూపర్’ మ్యాచ్..