
19వ ఆసియా క్రీడల్లో(Asian Games)లో భారత్ కు పతకాల పంట పండుతోంది. ఎన్నడూ లేని రీతిలో 100 మెడల్స్ దిశగా దూసుకుపోతున్నది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ లో తాజాగా పురుషుల హాకీ జట్టు ఘన విజయం సాధించింది. తొమ్మిదేళ్ల తర్వాత ఈ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా పారిస్ ఒలింపిక్స్ కి నేరుగా క్వాలిఫై అయింది. 5-1 గోల్స్ తేడాతో జపాన్ ఓడించి స్వర్ణ పతకాన్ని(Gold Medal) అందుకుంది. ఇప్పటివరకు భారత్ 95 మెడల్స్ సాధించగా అందులో 22 బంగారు, 34 రజత, 39 కాంస్యం ఉన్నాయి. మహిళల 62 కేజీల రెజ్లింగ్ లో సోనమ్ మాలిక్ కాంస్య పతకం అందుకుంది. శుక్రవారం(ఈనెల 6నాడు) సాయంత్రం వరకు 7 పతకాలు భారత్ సొంతమయ్యాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి.
శుక్రవారం నాటి పతకాలు
* పురుషుల హాకీలో స్వర్ణం దక్కింది.
* రికర్వ్ ఆర్చరీ ఈవెంట్ లో భారత్ టీమ్ ఫైనల్ లో దక్షిణకొరియా చేతిలో ఓడిపోయి సిల్వర్ మెడల్ అందుకుంది.
* బ్రిడ్జ్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ లో హాంకాంగ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
* బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్ లో ఓడినా ప్రణయ్ మాత్రం కాంస్యం అందుకున్నాడు.
* సెపక్ తక్రా ఈవెంట్ లో మన జట్టు మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకుంది.
* మహిళల 76 కేజీల విభాగంలో రెజ్లర్ కిరణ్ బిష్ణోయ్.. మంగోలియాకు చెందిన గణబత్ పై 6-3తో గెలిచి కాంస్య పతకం దక్కించుకుంది.
* పురుషుల 57 కిలోల విభాగంలో చైనాకు చెందిన మింగ్ లియూపై గెలిచి రెజ్లర్ అమన్ నెహ్రావత్ కాంస్యం గెలుచుకున్నాడు.