Published 18 Dec 2023
సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతాపం చూపించి పాక్ ను ఘోర పరాజయం పాలు చేసింది. పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్టు(Test Match)లో 360 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 450 టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సౌద్ షకీల్(24)దే హయ్యెస్ట్ స్కోర్ కాగా ఎక్స్ ట్రా(20)లది రెండో స్థానం. ఓపెనర్లు షఫీక్(2), ఇమామ్(10), మసూద్(2), బాబర్(14), సర్ఫరాజ్(4), సల్మాన్(5) అంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. స్టార్క్, హేజిల్ వుడ్ 3 వికెట్ల చొప్పున, లైయన్ 2, కమిన్స్ ఒక వికెట్ చొప్పున తీసుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కంగారూలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 487 పరుగుల భారీ స్కోరు చేశారు. తన తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 271 రన్స్ కే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 233 వద్ద డిక్లేర్డ్ చేసిన ఆస్ట్రేలియా.. పాక్ కు 450 రన్స్ టార్గెట్ ఇచ్చింది. కానీ ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి తాళలేక పాకిస్థాన్ కనీసం 100 పరుగుల మార్కునైనా అందుకోలేకపోయింది. దీంతో నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో 90, సెకండ్ ఇన్నింగ్స్ లో 63 పరుగులతోపాటు ఒక వికెట్ తీసుకున్న మిచెల్ మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.