వరల్డ్ కప్ ఫేవరేట్లలో ఒకటిగా భావించే ఆస్ట్రేలియా(Australia)కు చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మూడు మ్యాచ్ ల్లో రెండింట్లో ఓడి పాయింట్ల టేబుల్ లో వెనుకబడ్డ ఆసీస్.. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశముంది. మరోవైపు పాకిస్థాన్(Pakistan) మూడు మ్యాచ్ లకు గాను రెండింట్లో గెలిచి ఆసీస్ కన్నా పై స్థానంలో నాలుగు పాయింట్లతో ఉంది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైనా శ్రీలంకతో పోరులో అన్ని రంగాల్లో ఆస్ట్రేలియా రాణించి గెలుపును సొంతం చేసుకుంది. మిచెల్ మార్ష్ తొలి రెండింట్లో ఫెయిలయినా మూడో మ్యాచ్ లో మాత్రం ఫామ్ లోకొచ్చాడు. అటు బౌలింగ్ లోనూ స్పిన్నర్ ఆడమ్ జంపా విజృంభించాడు. మూడు మ్యాచ్ లకు గాను నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన పాక్ సైతం నెట్ రన్ రేట్ లో బాగా వెనుకబడి ఉంది.
బెంగళూరులో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కు గాను ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్లకు రెండు జట్లు కీలకం కాగా.. ఈ వరల్డ్ కప్ లో కీలక సీమర్లంతా పెద్దగా ప్రభావం చూపని విధంగా తయారయ్యారు. షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ లను మిగతా టీమ్ లు ఎలా ఆటాడుకున్నాయో చూశాం. ఇప్పుడీ ఇరు జట్ల(Two Teams) బౌలింగ్ దళం బాగానే ఉన్నా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారన్న దానిపైనే గెలుపు అవకాశాలు(Winning Chances) ఆధారపడి ఉన్నాయి.