
మిచెల్ మార్ష్ భారీ సెంచరీతో దుమ్ముదులపడంతో భారీ స్కోరు సైతం చిన్నదైపోయింది. ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడటంతో చివరి లీగ్ మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పుణె స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బంగ్లాకు బ్యాటింగ్ అప్పగించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అంతా తలో చేయి వేయడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కంగారూ టీమ్.. 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 రన్స్ చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
నిలబడ్డ బంగ్లా బ్యాటర్లు
ఈ మ్యాచ్ లో బంగ్లాకు మంచి ఓపెనింగ్ లభించింది. తాంజిద్ హసన్(36), లిటన్ దాస్(36) ఫస్ట్ వికెట్ కు 76 రన్స్ అందించారు. శాంటో(45), తౌఫిద్ హృదాయ్(74) సైతం మంచి పార్ట్నర్ షిప్ తో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగింది. మహ్మదుల్లా(32), ముష్ఫికర్(21), మిరాజ్(29) అందరూ కాసేపు క్రీజులో నిలబడ్డారు. ఒకవైపు సహచరులు ఒక్కరొక్కరుగా వెనుదిరుగుతున్నా అవతలి ఎండ్ లో హృదాయ్ ఆస్ట్రేలియాకు పరీక్ష పెట్టాడు. కమిన్స్, అబాట్, స్టాయినిస్ బౌలింగ్ లో బాగా పరుగులు రాబట్టారు. రెండు వికెట్లు తీసుకున్న జంపా, వికెట్లు దక్కని హేజిల్ వుడ్ మాత్రమే ప్రభావం చూపారు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బంగ్లా రన్ రేట్ 5.50కు పైగా సాగిందంటేనే కంగారూల బౌలింగ్ ను ఎలా ఆడుకున్నారో అర్థమవుతుంది.
రాణించిన మార్ష్, వార్నర్
ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్(10) తొందరగానే ఔటైనా మరో ఓపెనర్ వార్నర్ తోపాటు మిచెల్ మార్ష్ మంచి భాగస్వామ్యం(Partnership) జోడించారు. ముఖ్యంగా మార్ష్(177; 132 బంతుల్లో 17×4, 9×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వార్నర్(53), స్మిత్(63) హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. ఏ దశలోనూ ఆస్ట్రేలియా తడబడకుండా భారీ విజయాన్ని దక్కించుకుంది. మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.