ఇంగ్లాండ్ లో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో తొలి టెస్టు నెగ్గిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ జోరు కొనసాగిస్తోంది. ఆట తొలిరోజు నాడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ దీటైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(85 బ్యాటింగ్; 149 బంతుల్లో 10X4), అలెక్స్ క్యారీ( 11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ట్రావిస్ హెడ్ (77; 73 బంతుల్లో 14X4) ధనాధన్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. సీనియర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (66; 88 బంతుల్లో 8X4, 1X6) సైతం ధాటిగా ఆడాడు. ఇంగ్లిష్ బౌలర్లలో జో రూట్ (2/19), జోష్ టంగ్(2/88) వికెట్లు తీశారు.
తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆడిన తీరుగానే రెండో టెస్టులో ఆసీస్ అదే పద్ధతిని ఫాలో అయింది. హెడ్, వార్నర్ తోపాటు స్మిత్ కూడా ఫాస్ట్ గా రన్స్ చేయడంతో ఇంగ్లాండ్ డిఫెన్స్ లో పడిపోయింది. ఫస్ట్ టెస్టులో విఫలమైన స్టీవ్ స్మిత్ రెండో టెస్టులో ప్రతాపం చూపిస్తూ సెంచరీ దిశగా ముందుకు సాగుతున్నాడు. ట్రావిస్ హెడ్ వన్డే టైప్ ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరి సెంచరీ పార్ట్నర్ షిప్ తో ఆసీస్ పటిష్ఠ స్థితిలో నిలిచింది.