ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తక్కువ స్కోరుకే భారత్ ఆలౌటైంది. ఆడింది అరంగేట్ర(Debut) టెస్టే అయినా నితీశ్ కుమార్ రెడ్డే(41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టాప్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో 150 పరుగులకే టీమ్ఇండియా కథ ముగిసింది. 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును పంత్-నితీశ్ జోడీ అదుకునే ప్రయత్నం చేసింది. కానీ రిషభ్(37) క్యాచ్ ఇచ్చి అవుటవడంతో బాధ్యతంతా నితీశ్ కుమార్ పై పడింది. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. ఆడినంత సేపు ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియా పేస్ దళం ధాటికి విలవిల్లాడింది. జైస్వాల్(0) డకౌట్ అయితే కేఎల్ రాహుల్(26), దేవ్ దత్ పడిక్కల్(0), కోహ్లి(5), ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) ఎక్కువసేపు ఆడకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీస్తే స్టార్క్, కమిన్స్, మార్ష్ రెండేసి చొప్పున ఖాతాలో వేసుకున్నారు.