పటిష్ఠంగా కనిపించే ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా రెండో మ్యాచ్ లోనూ పరాభవం తప్పలేదు. టాప్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచిన ఆసీస్ దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించగా.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్ 40.5 ఓవర్లలో 177 రన్స్ కు ఆలౌటై 134 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ లో ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్(109; 106 బంతుల్లో 8×4, 5×6) వరుసగా రెండో మ్యాచ్ లోనూ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకున్నా ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరును సాధించిపెట్టాడు. మార్ క్రమ్ మాత్రమే(56) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ బవుమా(35), వాన్ డెర్ డసెన్(26), హెన్రిచ్ క్లాసెన్(29), మిల్లర్(17) అందరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్ మాత్రమే ప్రభావం చూపాడు. మ్యాక్స్ వెల్ బౌలింగ్ ఆడటమే కష్టమైంది దక్షిణాఫ్రికా ప్లేయర్స్ కు. మ్యాక్స్ వెల్, స్టార్క్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.
తోకముడిచిన టాప్, మిడిలార్డర్
అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కంగారూలు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయారు. 27 రన్స్ వద్దే రెండు వికెట్లను కోల్పోయిన ఆ జట్టు 70 రన్స్ కు చేరుకునేసరికి 6 వికెట్లు కోల్పోయిందంటే ఆ టీమ్ ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్ష్(7), వార్నర్(13), స్మిత్(19), ఇంగ్లిస్(5), మ్యాక్స్ వెల్(3), స్టాయినిస్(5) కంటిన్యూగా అంతా పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఆస్ట్రేలియా పని అయిపోయిందని అనుకుంటున్న దశలో లబుషేన్ క్రీజులో నిలబడ్డాడు. స్టార్క్(27)తో కలిసి కాసేపు సౌతాఫ్రికా బౌలర్లను అడ్డుకున్నా చివరకు 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లబుషేన్ ఔటయ్యాడు. దీంతో కంగారూల కథ 177 రన్స్ వద్ద ముగిసింది.