యాషెస్ టెస్టు సిరీస్ లో మంచి ఊపు మీదున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌటయింది. ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు గెలిచిన కంగారూలు.. ఈ మ్యాచ్ లో తొందరగానే పెవిలియన్ చేరారు. మిచెల్ మార్ష్(118; 118 బంతుల్లో 17×4, 4×6) వన్డే తరహా బ్యాటింగ్ చేసినా మిగతా ప్లేయర్స్ నుంచి సహకారం లభించకపోవడంతో 263 పరుగులకే ఆసీస్ కథ క్లోజ్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్(5/34) ప్రతాపం చూపించగా, వోక్స్(3/73), బ్రాడ్(2/58) ఆసీస్ కు ముచ్చెటమలు పట్టించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మలుపులు, కుదుపులకు లోనవుతున్నా మార్ష్ పట్టుదలగా ఆడాడు. అవతలి ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లేకున్నా ఒంటరి పోరాటం చేసి ఆ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు కారణమయ్యాడు. ఓపెనర్లు వార్నర్(4), ఖవాజా(13) తొందరగానే ఔటవగా.. లబుషేన్(21), స్మిత్(22) వెంటవెంటనే ఔటయ్యారు. ఇలా టాప్ ఆర్డర్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టినా మిచెల్ మార్ష్ పట్టుదలగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ సైతం తడబాటుకు గురైంది. 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ(33), బెన్ డకెట్(2) ఫెయిలవగా.. ఫస్ట్ డౌన్ లో వచ్చిన హ్యారీ బ్రూక్ సైతం(3) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(2/28), మిచెల్ మార్ష్(1/9) వికెట్లు తీశారు.