ప్రతి సెషన్లోనూ ఉత్కంఠ రేపుతూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్.. యాషెస్ అంటే ఎందుకు రంజుగా ఉంటుందో చెప్పకనే చెప్పింది. ఐదో రోజు విజయం ఇరు జట్లతో దోబూచులాడిన పరిస్థితుల్లో ప్రెజర్ ను ఛేజ్ చేసిన జట్టే విన్నర్ గా నిలిచింది. యాషెస్ సెకండ్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ అసమాన పోరాటానికి అడ్డుకట్ట వేసిన ఆసీస్… 43 పరుగుల తేడాతో అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. 371 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్… 327 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్(155; 214 బంతుల్లో 9X4, 9X6) ఒంటరి పోరాటం చేసినా ఫలితం శూన్యం. ఎడాపెడా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడినా చివరకు కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆ జట్టు కథ ముగిసింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా.. 101.5 ఓవర్లలో 279 పరుగులకే చాప చుట్టేసింది. ఉస్మాన్ ఖవాజా(77; 187 బంతుల్లో 12X4) అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఎక్స్ ట్రాల ద్వారా వచ్చిన 36 పరుగులే ఆ జట్టులో సెకండ్ హయ్యస్ట్. స్టీవ్ స్మిత్(34), లబుషేన్(30), డేవిడ్ వార్నర్(25), అలెక్స్ క్యారీ(21) ఇలా అందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఆసీస్ కథ వెంటనే క్లోజ్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్(4/65) వికెట్లు తీయగా.. జోష్ టంగ్, ఒలీ రాబిన్సన్ తలో రెండు వికెట్లు పడ గొట్టారు. కంగారూలు తొలి ఇన్నింగ్స్ లో 416 రన్స్ చేయగా, ఇంగ్లాండ్ 325 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 91 రన్స్ లీడ్ దక్కింది.
371 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 9 పరుగుల స్కోర్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జాక్ క్రాలీ(3) స్టార్క్ బౌలింగ్ లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్కోర్ బోర్డుపై మరో 4 పరుగులు చేరాయో లేదో రెండో వికెట్ పడింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(3) సైతం నిరాశపరిచాడు. మరికొద్దిసేపటికే వరుసగా జో రూట్(18), హ్యారీ బ్రూక్(4) ఔటయ్యారు. ఈ ఇద్దరినీ కెప్టెన్ కమిన్స్ బుట్టలో వేసుకున్నాడు. కానీ ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సెంచరీ పూర్తి చేశాడు. ఎడాపెడా సిక్స్ లతో విరుచుకుపడుతూ ధనాధన్ బ్యాటింగ్ తో మరోసారి తానేంటో చాటిచెప్పాడు.
ముఖ్యంగా ఈ రెండో టెస్టులో అందరినీ అట్రాక్ట్ చేసిన ప్లేయర్.. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అని చెప్పాలి. తొలి టెస్టులో ‘బజ్ బాల్’ గేమింగ్ తో చతికిల పడ్డా… తర్వాతి టెస్టులోనూ అదే ఆటతీరుతో అలరించాడు. ముఖ్యంగా 5 టాప్ ఆర్డర్ వికెట్టు పడ్డా.. తన ఆటతీరును మార్చుకోలేదు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో మ్యాచ్ ఎండ్ వరకు జట్టును నడిపించిన తీరు ఆకట్టుకుంది. కంగారూ బౌలర్లలో కమిన్స్, హేజిల్ వుడ్, స్టార్క్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన కంగారూలు 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉన్నారు.