పోరాటమంటే అది.. గెలిచే పరిస్థితులు ఏ మాత్రం లేవని తెలిసినా పోరాడితే పోయేదేముంది అనుకున్నాడు ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్. ఒకవైపు కాలు, నడుము నొప్పితే స్టేడియంలో దొర్లాట. మరోవైపు టీమ్ ను బయటపడేయాలన్న ఆరాటం. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు మ్యాక్స్ వెల్. సింగిల్ రన్ చేసేందుకు అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో మ్యాక్స్ వెల్ (201 నాటౌట్; 128 బంతుల్లో 21×4, 10×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అఫ్గానిస్థాన్ పై కంగారూలు సంచలన విజయాన్ని అందుకున్నారు. ముంబయి వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్.. 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా 46.5 7 వికెట్లకు 293 రన్స్ చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మరోసారి సత్తా చూపిన అఫ్గాన్
ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించి వారెవ్వా అనిపించిన అఫ్గాన్… ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను అదే స్థితికి తీసుకెళ్లింది. కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్, జంపా వంటి మేటి బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(127; 142 బంతుల్లో 8×4, 3×6) సెంచరీ చేయడంతో భారీ స్కోరు నమోదు చేసింది. ఫస్ట్ ఓవర్ నుంచి చివరి ఓవర్ వరకు జద్రాన్ క్రీజులో ఉన్నాడు. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకున్నా ఒంటరి పోరాటం చేశాడు. గుర్బాజ్(21), రహ్మత్ షా(30), హష్మతుల్లా షాహిది(26), అజ్మతుల్లా ఒమర్జాయ్(22), మహ్మద్(12) తలో చేయి వేశారు. ఎంత ప్రయత్నించినా ఆసీస్ బౌలర్లు ఈ ఓపెనర్ ను మాత్రం అవుట్ చేయలేకపోయారు. ఆఖర్లో రషీద్ ఖాన్(35; 18 బంతుల్లో 2×4, 3×6) సైతం విజృంభించాడు.
దయనీయం నుంచి దంచేదాకా
తొలి 15 ఓవర్లలో కంగారూల ఆటతీరు చూస్తే ఇది ఆస్ట్రేలియానేనా అన్న అనుమానం కలిగింది. 4కే ఒక వికెట్.. 49కి చేరేసరికి నాలుగు… 91 రన్స్ కు ఏడు వికెట్లు.. ఇదీ కంగారూ జట్టు తీరు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) డకౌట్ కాగా మరో ఓపెనర్ వార్నర్(18)కే వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్(24), లబుషేన్(14) నిరాశపరిచారు. ఇక్కడే ఆస్ట్రేలియా పూర్తి ఆత్మరక్షణలో పడిపోయింది. వార్నర్ ను క్యాచ్ తో ఔట్ చేసిన ఒమర్ జాయ్.. తర్వాతి బంతికే ఇంగ్లిస్(0)ను బుట్టలో వేసుకున్నాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోవడానికి తోడు స్టాయినిస్(6)ను రషీద్ ఖాన్ ఎల్బీగా ఔట్ చేయడంతో ఆసీస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వెంటనే స్టార్క్(3) ఔటయ్యాడు. అప్పట్నుంచి మొదలైంది మ్యాక్స్ వెల్ మాయాజాలం. ఒకవైపు కెప్టెన్ కమిన్స్ అండతో చెలరేగాడు. అతడి డబుల్ సెంచరీలో సిక్స్ లు, ఫోర్ల ద్వారా వచ్చినవే 144 రన్స్ ఉన్నాయంటే హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చాలా సార్లు సింగిల్ తీసే అవకాశమున్నా వదిలేసి మరీ బంతిని బౌండరీ లైన్ దాటించాడు. గ్లెన్ మాయతో ఓడుతుందనుకున్న ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు.. ఆస్ట్రేలియా పోరాట పటిమ ఎలాంటిదో.