వరుసగా రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఎట్టకేలకు మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకొంది. రాజ్ కోట్ లో జరిగిన చివరి వన్డేలో 66 పరుగులతో భారత్ పై విజయం సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 రన్స్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ మిచెల్ మార్ష్(96; 84 బంతుల్లో 13×4, 3×6) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. స్టీవ్ స్మిత్(74; 61 బంతుల్లో 8×4, 1×6), లబుషేన్ (72; 58 బంతుల్లో 9×4), వార్నర్(56; 34 బంతుల్లో 6×4, 4×6) ఫాస్ట్ గా ఆడటంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. 78 స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయిన కంగారూ జట్టు 215 వరకు మరో వికెట్ చేజార్చుకోలేదు. రెండో వికెట్ కు మార్ష్, స్మిత్ జోడీ 137 పరుగులు జత చేసింది. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్ ధారాళంగా పరుగులిచ్చారు. బుమ్రా 3 వికెట్లు తీయగా… కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ దీటుగా జవాబిచ్చింది. అయితే సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్ ను ఆస్ట్రేలియా పార్ట్ టైమర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ దెబ్బకొట్టాడు. ముఖ్యంగా తొలుత రోహిత్(81; 57 బంతుల్లో 5×4, 6×6) సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ కు జోడీగా ఓపెనింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) పెద్దగా రాణించకున్నా కోహ్లి(56; 61 బంతుల్లో 5×4, 1×6) సత్తా చూపించాడు. కానీ రోహిత్ ఒక అనూహ్య క్యాచ్ తో వెనుదిరగాల్సి వచ్చింది. తన బౌలింగ్ లోనే స్ట్రెయిట్ క్యాచ్ అందుకున్న మ్యాక్స్ వెల్… క్యాచ్ పట్టానన్న విషయాన్ని కొన్ని క్షణాల పాటు తానే నమ్మలేకపోయాడు. రోహిత్, కోహ్లి వెంటవెంటనే వెనుదిరగ్గా.. కాసేపు శ్రేయస్ అయ్యర్(48) పోరాటం చేశాడు. కానీ మ్యాక్స్ వెల్ బౌల్డ్ చేయడంతో హాఫ్ సెంచరీ పూర్తి కాకుండానే అయ్యర్ వెనుదిరగాల్సి వచ్చింది. రాహుల్(26), సూర్యకుమార్(8) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. చివర్లో జడేజా(35) కూడా ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ 49.4 ఓవర్లలో 286 రన్స్ వద్ద ముగిసింది. మ్యాక్స్ వెల్ 4, హేజిల్ వుడ్ 2, స్టార్క్, కమిన్స్, గ్రీన్, సంఘా ఒక్కో వికెట్ తీసుకున్నారు. నాలుగు వికెట్లు, రెండు క్యాచ్ లు తీసుకున్న మ్యాక్స్ వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలవగా.. 178 రన్స్ చేసిన శుభ్ మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గా సెలెక్ట్ అయ్యాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1తో నిలిచి కప్పును అందుకుంది.