Published 23 Dec 2023
భారత రెజ్లింగ్ ఫెడరేషన్(WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ విషయంలో చోటుచేసుకున్న వ్యవహారంపై సాక్షి మాలిక్ కు క్రీడాలోకం నుంచి మద్దతు లభిస్తూనే ఉంది. లైంగిక ఆరోపణల కేసులో WFI నుంచి తప్పుకున్న బ్రిజ్ భూషణ్ స్థానంలో ఆయన అత్యంత సన్నిహితుడు సంజయ్ సింగ్ తిరిగి ప్రెసిడెంట్ గా ఎన్నికవడంతో ఈ వివాదం కంటిన్యూ అవుతోంది. సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సీనియర్ రెజ్లర్లంతా ఆందోళన బాట పట్టారు. తాను రెజ్లింగ్ నుంచే తప్పుకుంటున్నానని హరియాణాకు చెందిన ప్లేయర్, రెజ్లింగ్ లో తొలి ఒలింపిక్స్ మెడల్ సాధించిన సాక్షి మాలిక్ ఈ నెల 21న ప్రకటించింది. మిగతా ప్లేయర్లయిన భజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తో కలిసి ఆమె ఈ జనవరి నుంచి WFIపై పోరాటం చేస్తూనే ఉంది. ఆమె రిటైర్మెంట్ పై కేంద్రం నుంచి స్పందన లేకపోగా.. వ్యక్తిగత కారణాల వల్లే సాక్షి అలాంటి డిసిషన్ తీసుకుందని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే మరో మెడలిస్ట్ సైతం సాక్షికి సపోర్ట్ ఇచ్చాడు.
సీనియర్ మెడలిస్ట్ సైతం…
‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ వీరేందర్ సింగ్ యాదవ్.. తన ‘పద్మశ్రీ’ అవార్డును రిటర్న్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే భజరంగ్ పునియా సైతం అవార్డును తిరిగి ఇవ్వగా.. 2005 గోల్డ్ మెడలిస్ట్ అయిన వీరేందర్ సైతం అదే బాటను అనుసరిస్తున్నట్లు తెలిపాడు. ఈయనకు 2021లో ‘పద్మశ్రీ’, 2015లో ‘అర్జున’ పురస్కారాలు దక్కాయి. WFIలో జరుగుతున్న వ్యవహారాలపై క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, ఫేమస్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని వీరేందర్ సింగ్ కోరాడు. ‘నా సోదరి, నాబిడ్డ కోసం అవార్డును తిరిగిచ్చేయాలని అనుకుంటున్నా పీఎం నరేంద్ర మోదీ సర్.. సాక్షి మాలిక్ ను చూస్తే గర్వంగా ఉంది.. నేను టాప్ ప్లేయర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా.. దేశం కోసం ఏదో ఒక డిసిషన్ తీసుకోండి..’ అంటూ ‘X’లో పోస్ట్ చేశారు.