Published 22 Dec 2023
టీ20 సిరీస్ ను సమం చేసి వన్డే ట్రోఫీని 2-1తో అందుకున్న టీమిండియా.. టెస్టు మ్యాచ్ ల్లోనూ సత్తా చూపించాలని తహతహలాడుతోంది. టీ20, వన్డే ఫార్మాట్లకు భిన్నంగా సీనియర్ ఆటగాళ్లంతా ఈ టెస్ట్ సిరీస్ లో ఆడుతున్నారు. అయితే సౌతాఫ్రికా నుంచి అత్యవసరంగా భారత్ కు తిరిగి రావాల్సిన పరిస్థితి తలెత్తడంతో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి సేవలు అందకుండా పోతున్నాయి. ఈ నెల 26 నుంచి మొదలు కానున్న తొలి టెస్టుకు విరాట్ అందుబాటులో ఉండటం లేదని BCCI వర్గాలు తెలిపాయి. టెస్ట సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన స్క్వాడ్ లో కోహ్లి ఉన్నాడు. అయితే తన కుటుంబంలో అత్యవసర పరిస్థితి(Emergency Situation) తలెత్తడంతో అతడు భారత్ కు పయనమయ్యాడు. అయితే తొలి టెస్టుకు అందుబాటులో ఉండకున్నా.. ఆ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి తిరిగి జట్టుతో చేరతాడని బోర్డు వర్గాలు అంటున్నాయి.
యువ ఓపెనర్ సైతం…
తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరమవుతుంటే ఈ సిరీస్ నుంచే రుతురాజ్ గైక్వాడ్ తప్పుకున్నాడు. వేలికి తీవ్రమైన గాయం కావడంతో అతడు స్వదేశానికి వచ్చేస్తున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఉంగరపు వేలికి గాయమై పగులు వచ్చింది. దీంతో అతను మిగతా మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని BCCI తెలియజేసింది.