అఫ్గానిస్థాన్ పై బంగ్లాదేశ్ జూలు విదిల్చింది. ఆసియా కప్ లో భాగంగా లాహోర్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 రన్స్ భారీ స్కోరు సాధించగా.. ప్రత్యర్థిని 245 పరుగులకు ఆలౌట్ చేసి 89 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ మెహిదీ హసన్ మిరాజ్(112, 119 బంతుల్లో; 7×4, 3×6), నజ్ముల్ హుసేన్ శాంటో(104, 105 బంతుల్లో; 9×4, 2×6) దుమ్ము దులిపారు. మూడో వికెట్ కు 194 రన్స్ పార్ట్నర్ షిప్ నమోదు చేసి బంగ్లాకు భారీ స్కోరు అందించారు. కెప్టెన్ షకీబుల్ హసన్(32 నాటౌట్), మహ్మద్ నయీం(24) తలో చేయి వేశారు. బంగ్లా జట్టులో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ గా వెనుదిరిగారు.
335 రన్స్ టార్గెట్ తో బరిలోకి అఫ్గాన్.. చివరి వరకు పోరాటం కొనసాగించింది. ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ (75, 74 బంతుల్లో; 10×4, 1×6), కెప్టెన్ హష్మతుల్లా సాహిది(51, 60 బంతుల్లో; 6×4) రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఆ జట్టు 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో రషీద్ ఖాన్(24, 15 బంతుల్లో; 3×4, 1×6) మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, షరీఫుల్ ఇస్లాం 3 వికెట్లతో అఫ్గాన్ వెన్నువిరిచారు. హసన్ మహమూద్, మిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. 112 రన్స్ తోపాటు ఒక వికెట్ తీసుకున్న మెహిదీ హసన్ మిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.