18 బంతుల్లో చేయాల్సిన పరుగులు 31. అప్పటికే 7 వికెట్లు కోల్పోగా క్రీజులో ఉన్నది అక్షర్, శార్దూల్. 48వ ఓవర్లో చివరి రెండు బాల్స్ కు ఫోర్, సిక్స్ కలిపి మొత్తం 14 రన్స్ వచ్చాయి. 12 బంతుల్లో 17 రన్స్ ఈజీ అనుకున్న టైమ్ లో అక్షర్, శార్దూల్ ఔటయ్యారు. ఇలా చివర్లో ఉత్కంఠ రేపిన భారత్-బంగ్లా పోరులో చివరకు చిన్న జట్టే గెలుపొందింది. సూపర్-4లో రెండు పెద్ద జట్లపై సులువుగా గెలిచిన భారత్.. టోర్నమెంట్ నుంచే వెైదొలిగిన బంగ్లా చేతిలో ఓటమి పాలైంది. ఓపెనర్ గిల్ సూపర్ సెంచరీ(121; 133 బంతుల్లో, 8×4, 5×6) చేసినా ఏ ఒక్కరూ నిలదొక్కుకోలేక 260 రన్స్ కు రోహిత్ సేన ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ బంగ్లాకు బ్యాటింగ్ అప్పగించగా.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. టార్గెట్ లో భారత్ 259 రన్స్ కు ఆలౌట్ కావడంతో బంగ్లా 6 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో నలుగురు భారత ప్లేయర్లు కోహ్లి, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ స్థానంలో తిలక్ వర్మ, సూర్య, అక్షర్, ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించారు.
తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాకు స్టార్టింగ్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్(13) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఇక ఫస్ట్ డౌన్ లో వచ్చిన అనాముల్ హక్(4) ఓపెనర్లను ఫాలో అయ్యాడు. హసన్, హక్ లను శార్దూల్ వెనక్కు పంపాడు. 28 రన్స్ కే 3 వికెట్లు కోల్పోగా కెప్టెన్ షకిబుల్ హసన్(80; 85 బంతుల్లో, 6×4, 3×6) ఆదుకున్నాడు. మధ్యలో మెహిదీ హసన్ మిరాజ్(13) ఔటయినా తౌహిద్ హృదాయ్(54; 81 బంతుల్లో, 5×4, 2×6)తో కలిసి షకిబుల్ బెస్ట్ పార్ట్నర్ షిప్ నమోదు చేశాడు. ఈ జోడీ ఐదో వికెట్ కు 101 పరుగులు అందించడంతో బంగ్లా మంచి స్కోరు చేసింది. చివరకు షకిబుల్ శార్దూల్ బాల్ కు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరూ ఔటైనా చివర్లో నసూమ్ అహ్మద్(45; 44 బంతుల్లో, 6×4, 1×6) ధాటిగా ఆడుతూ టెయిలెండర్లు మెహిదీ హసన్(29), తాంజిమ్ హసన్ షకిబ్(14)తో కలిసి ఇన్నింగ్స్ ను 265 రన్స్ వరకు తీసుకెళ్లాడు. శార్దూల్ 3, షమి 2 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్, అక్షర్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.
భారత జట్టులో రోహిత్(0)కే ఔట్ కాగా.. గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మశ్(5), రాహుల్(19), ఇషాన్(5), సూర్యకుమార్(26), జడేజా(7) ఒకరి వెంట ఒకరు ఔటయ్యారు. చివర్లో అక్షర్(42; 34 బంతుల్లో, 3×4, 2×6) ధాటిగా ఆడినా అక్షర్, శార్దూల్(7) త్వరత్వరగా ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ముస్తాఫిజుర్ 3, తాంజిమ్, మెహిద్ హసన్ 2 చొప్పున, షకిబ్, మిరాజ్ తలో వికెట్ చొప్పున తీసుకున్నారు. 80 రన్స్ తోపాటు 1 వికెట్ తీసిన కెప్టెన్ షకిబుల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ లో భారత్, శ్రీలంక తలపడతాయి.