ద్వైపాక్షిక సిరీస్ ల టెలివిజన్, డిజిటల్ ప్రసార(Telecast) హక్కుల వేలం ద్వారా BCCIకి మరోసారి కాసుల పంట పండింది. ఐదేళ్ల కాలానికి సంబంధించిన రైట్స్ ను వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని BCCI సెక్రటరీ జై షా ట్వీట్ ద్వారా తెలియజేశారు. 2023 సెప్టెంబరు నుంచి 2028 మార్చి వరకు రానున్న ఐదేళ్ల పాటు ఇంటర్నేషనల్, దేశవాళీ మ్యాచ్ లను వయాకామ్ 18 టెలికాస్ట్ చేస్తుంది. టెలికాస్ట్ చేసిన ప్రతి మ్యాచ్ కు మీడియా రైట్స్ రూపంలో రూ.67.8 కోట్లు అందుకోనుంది. మొత్తంగా 88 మ్యాచ్ లు జరగనుండగా.. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. టీవీ ప్రసారాలు స్పోర్ట్ 18లో, జియో సినిమా ప్లాట్ ఫాంలోనూ స్ట్రీమింగ్ కానున్నాయని BCCI తెలిపింది. ఈ వేలంలో వయాకామ్ తోపాటు సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ పోటీ పడ్డాయి. ఈ రెండింటి నుంచి వయాకామ్ కు గట్టి పోటీ ఎదురైంది.
భారత మ్యాచ్ లతోపాటు IPL(డిజిటల్), మహిళా ప్రీమియర్ లీగ్ 2024, సౌతాఫ్రికా, సౌతాఫ్రికా 20 ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్, పారిస్ ఒలింపిక్స్ 2024, టీ10 లీగ్ వంటి టోర్నీలన్నీ ఈ వయాకామ్ 18 పరిధిలోకి వస్తాయి. అతి కొద్ది రోజుల్లోనే అక్టోబరులో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 ఇంటర్నేషనల్ టీ20లను వయాకామ్ 18 టెలికాస్ట్ చేస్తుంది. అయితే మొత్తం ఎంత వచ్చిందనేది భారత క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు.