టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరేట్లుగా భావించిన భారత్, ఇంగ్లండ్ జట్లు… నేడు తలపడబోతున్నాయి. వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ అపజయం ఎరుగని భారత్ ను వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లిష్ టీమ్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. బజ్ బాల్ గేమ్ తో కొంతకాలం నుంచి ఆట స్వరూపాన్నే మార్చేసింది. కానీ ఆ ఎత్తులు గత రెణ్నెల్ల నుంచి పెద్దగా పారడం లేదు. ఈ వరల్డ్ కప్ లో 5 మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో ఓడిన ఆ జట్టు.. 10 టీమ్ లు పాల్గొంటున్న టోర్నీలో చివరి నుంచి మొదటి స్థానంలో నిలవడం ఆశ్చర్యకరంగా తయారైంది. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ కంటే కింది వరుసలో ఉండటం పెద్ద అవమానకరంగా మారింది. లఖ్ నవూలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.
పటిష్ఠంగా భారత్
ఇంగ్లండ్ కు పూర్తి భిన్నంగా భారత జట్టు కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఆడిన ఐదింట్లో గెలిచి ప్రపంచకప్ లో పరాజయం(Defeat) ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ తో పవర్ ప్లేలో 134.01 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థుల్ని దడదడలాడిస్తున్నాడు. అటు జస్ ప్రీత్ బుమ్రా సైతం పవర్ ప్లేలో 2.90 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ మిగతా బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా సెమీఫైనల్ చేరుకునే అవకాశం ఉండగా… ఇంగ్లండ్ ఓడితే ఇక ఇంటికి వెళ్లక తప్పదు. ఈ మ్యాచ్ కూ హార్దిక్ దూరం అవుతుండగా… బ్యాటింగ్ లో గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్లుగా ఆడుతుండటంతో ఇప్పటివరకు బ్యాటింగ్ లో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. అశ్విన్ ను తీసుకుని ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారా లేదంటే గత మ్యాచ్ లో సూపర్ గా వికెట్లు తీసిన షమితోపాటు బుమ్రా, సిరాజ్ ను కొనసాగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ రానుండటంతో రవీంద్ర జడేజా వరకు బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ను ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందన్నదే పెద్ద ఇంట్రెస్టింగ్ గా మారింది.