అవకాశమొస్తే ఏ జట్టునైనా ఆటాడుకుంటానని అఫ్గానిస్థాన్ మరోసారి నిరూపించింది. ఇప్పటికే నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న ఆ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ సాధించడంతో అఫ్గాన్ మెరుగైన స్కోరు సాధించింది. ముంబయి వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్.. బౌలర్లను కంగారూ పెట్టింది. కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్, జంపా ఇలా మేటి బౌలర్లని చెప్పుకునే అందరినీ ఉతికి ఆరేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకున్నా జద్రాన్(127; 142 బంతుల్లో 8×4, 3×6) మాత్రం ఫస్ట్ ఓవర్ నుంచి చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నాడు.
చివర్లో రషీద్ ఖాన్ దంచుడు
మరో ఓపెనర్ గుర్బాజ్(21), రహ్మత్ షా(30), హష్మతుల్లా షాహిది(26), అజ్మతుల్లా ఒమర్జాయ్(22), మహ్మద్(12) తలో చేయి వేశారు. ఎంత ప్రయత్నించినా ఆసీస్ బౌలర్లు ఈ ఓపెనర్ ను మాత్రం అవుట్ చేయలేకపోయారు. ఈ వరల్డ్ కప్ లో మంచి ఊపు మీదున్న ఇబ్రహీం జద్రాన్.. ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆఖర్లో రషీద్ ఖాన్(35; 18 బంతుల్లో 2×4, 3×6) సైతం విజృంభించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో 50 ఓవర్లలో అఫ్గాన్ 5 వికెట్లకు 291 పరుగుల భారీ స్కోరు సాధించింది.