ఇన్నింగ్స్ మొదటి బాల్ కే ఫోర్.. రెండో బంతికి రోహిత్ ఔట్. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోతే మరో వికెట్ కోసం 193 స్కోరు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది బౌలర్లకి. వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్(0) వెంటనే అవుటైనా గిల్, కోహ్లి, శ్రేయస్.. హాఫ్ సెంచరీలతో అదుర్స్ అనిపించారు. గిల్ 90లో.. కోహ్లి, శ్రేయస్ 80ల్లో అవుటయ్యారు. ఈ ముగ్గురి హాఫ్ సెంచరీలతో 50 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
సిక్సర్లతో శ్రేయస్ దూకుడు
శుభ్ మన్ గిల్(92; 92 బంతుల్లో 11×4, 2×6), విరాట్ కోహ్లి(88; 94 బంతుల్లో 11×4) భారత బ్యాటింగ్ కు అండగా నిలిచారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూనే హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకుని సెంచరీ దిశగా దూకుడు పెంచారు. రోహిత్ వికెట్ తీసుకున్న మధుశంక.. 3 పరుగుల తేడాలో గిల్, కోహ్లిని ఔట్ చేశాడు. అటు ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. ఇంతలో రాహుల్(21) షార్ట్ ఎక్స్ ట్రా కవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు ఫోర్లతో హుషారు మీద కనిపించిన సూర్యకుమార్(12) తొందరగానే ఔటయ్యాడు. అవతలి ఎండ్ లో వికెట్లు పడుతున్నా అయ్యర్(82; 56 బంతుల్లో 3×4, 6×6) మాత్రం గత వైఫల్యాల్ని పక్కనపెట్టి పూర్తి కాన్ఫిడెంట్ గా కనిపించాడు. సెంచరీ దిశగా సాగుతున్న శ్రేయస్ ను సైతం మధుశంకే ఔట్ చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా(35; 24 బంతుల్లో 1×4, 1×6) ఫాస్ట్ గా పరుగులు రాబట్టాడు. అందరూ మెయిన్ బ్యాటర్లను ఔట్ చేస్తూ మధుశంక 5 వికెట్లు తీసుకున్నాడు.