Published 26 Nov 2023
ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ హిట్టింగ్ కు దిగడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. తిరువనంతపురంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. జైస్వాల్(53; 25 బంతుల్లో 9×4, 2×6) ఫోర్లు, సిక్సులతో హోరెత్తించడంతో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ యువ ఓపెనర్ ధాటికి భారత్ జట్టు 3.5 ఓవర్లలో 50 స్కోరు చేసింది. జంపా బౌలింగ్ లో ఎలిస్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన తర్వాత మరో తుపాను క్రీజులోకి వచ్చింది. ఒక ఎండ్ లో రుతురాజ్ చూసుకుంటూ ఆడుతుంటే ఇంకో ఎండ్ లో బ్యాటర్లు రెచ్చిపోయారు.
ముగ్గురి హాఫ్ సెంచరీలు
ఇషాన్(52; 32 బంతుల్లో 3×4, 4×6) సైతం వేగంగా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 24 బంతుల్లో యశస్వి ఫిఫ్టీ చేస్తే, 29 బాల్స్ లో హాఫ్ సెంచరీ మార్క్ ను ఇషాన్ అందుకున్నాడు. అటు రుతురాజ్ సైతం అర్థ శతకం దాటాడు. ఇషాన్ ఔటైన తర్వాత సూర్యకుమార్ క్రీజులోకి వస్తూనే రెచ్చిపోయాడు. 10 బంతుల్లోనే 2 సిక్సర్లతో 19 రన్స్ చేసి క్యాచ్ ఇచ్చాడు. తొలి 100 పరుగుల్ని 9.5 ఓవర్లలో, 200 మార్క్ ను 18.3 ఓవర్లలో భారత్ అందుకుంది. ఇక రింకూసింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో ఆసీస్ బౌలర్ల భరతం పడుతూ 31 రన్స్ చేశాడు.