ఈ IPL సీజన్లో రాయల్ తరహాలో రాజస్థాన్ టీమ్ విజయాల బాటలో సాగుతున్నది. తనకు ఎదురే లేదన్నట్లుగా… తమనెవరూ ఓడించలేరన్నట్లుగా గెలుపు మీద గెలుపును సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే పాయింట్ల టేబుల్(Points Table)లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న RR.. మరో ఘన విజయాన్ని ఖాతాలో కలుపుకొంది. ముంబయితో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అద్భుత విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయిని బౌలింగ్ తో దెబ్బకొట్టిన రాజస్థాన్… తర్వాత బ్యాటింగ్ కు దిగి అందులోనూ అదరగొట్టింది. 5 వికెట్లతో సందీప్ శర్మ MIని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే… ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన యశస్వి జైస్వాల్ సెంచరీతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట హార్దిక్ సేన 9 వికెట్లకు 179 స్కోరు చేస్తే… 9 వికెట్లు మిగిలుండగానే 183 పరుగులు చేసి తిరుగులేని విజయం సాధించింది.
జైస్వాల్ దూకుడుతో రాజస్థాన్ కు ఆరంభం అదిరింది. బట్లర్(35; 25 బంతుల్లో 6×4) కొద్ది సేపే ఆడి ఔటైనా ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్.. యశస్వికి జత కలిశాడు. ఈ కుర్ర ఓపెనర్ 31 బంతుల్లో 50.. 59 బాల్స్ లో 100 కంప్లీట్ చేసుకున్నాడు.
అంతకుముందు రోహిత్(6), ఇషాన్(0), సూర్యకుమార్(8) మహ్మద్ నబీ(23), తిలక్ వర్మ(65; 45 బంతుల్లో 5×4, 3×6), నేహల్ వధేరా(49; 24 బంతుల్లో 3×4, 4×6) హార్దిక్(10), టిమ్ డేవిడ్(3) స్కోర్లు చేశారు.
ఇప్పటివరకు 8 మ్యాచ్ లాడిన రాజస్థాన్ రాయల్స్ ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అటు ముంబయి 8 మ్యాచ్ లే ఆడినా రాజస్థాన్ కు భిన్నంగా కేవలం మూడింట్లోనే గెలిచి ఐదు మ్యాచ్ ల్ని పోగొట్టుకుంది.