కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మిడలార్డర్ బ్యాటర్ శివమ్ దూబె శివాలెత్తడం(Hard Hitting)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఆధిపత్యం చూపించింది. 60 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమ్ ను ఈ ఇద్దరూ ముందుండి నడిపించారు. ముంబయి ఇండియన్స్(MI) బౌలర్ల ధాటికి తొలి మూడు ఓవర్ల దాకా నిదానంగా సాగిన బ్యాటింగ్.. గైక్వాడ్ బాదుడుతో ఊపందుకుంది. రెండో వికెట్ కు రచిన్ రవీంద్ర, గైక్వాడ్ జోడీ 36 బాల్స్ లో ఫిఫ్టీ పార్ట్నర్ షిప్ అందించింది.
రవీంద్ర ఔటయ్యాక…
రహానె(5), రచిన్(21) ఔటయ్యాక శివమ్ దూబె(66; 38 బంతుల్లో 10×4, 2×6) క్రీజులోకొచ్చాడు. అప్పటికే ఊపు మీదున్న రుతురాజ్(69; 40 బంతుల్లో 5×4, 5×6) కు దూబె జత కలవడంతో ఆకాశమే హద్దుగా పరుగుల పరంపర కొనసాగింది. ఈ జోడీ ధనాధన్ ఆటతీరుతో 15.1 ఓవర్లలోనే CSK స్కోరు 150 దాటింది. 14వ ఓవర్లో 22, 15వ ఓవర్లో 17 కలిపి మొత్తం 39 రన్స్ వచ్చాయి. గైక్వాడ్ 33 బాల్స్ లో ఫిఫ్టీ చేస్తే, దూబె 28 బంతుల్లోనే 50 మార్క్ అందుకున్నాడు.
మహి మూడు…
ఆ తర్వాత కూడా శివమ్ దూబె ఊపు(Speed) కంటిన్యూ అయింది. కానీ మిచెల్(17) ఔటవగానే ధోని క్రీజులోకొచ్చాడు. తనను అభిమానులు ఎందుకంత ఆరాధిస్తారో మరోసారి మహి నిరూపించాడు. వస్తూనే వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఓవర్లు ముగిసేసరికి చెన్నై 4 వికెట్లకు 206 పరుగులు చేసింది.