యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 91 రన్స్ లీడ్ సాధించగా, రెండో ఇన్నింగ్స్ లోనూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 130 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యం 221 పరుగులకు చేరుకుంది. మరో రెండ్రోజుల ఆట మిగిలి ఉన్న దృష్ట్యా కంగారూలను తక్కువ స్కోరుకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంటుంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 278 రన్స్ తో పటిష్ఠ స్థితిలో నిలిచిన ఇంగ్లాండ్… ప్రత్యర్థికి దీటుగా బదులిచ్చే దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ మూడో రోజు ఆట స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ కథ ముగిసింది. ఇంకో 47 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు సమర్పించుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(17) పరుగులేమీ చేయకుండానే వెనుదిరగ్గా.. హ్యారీ బ్రూక్(50; 68 బంతుల్లో 4X4) ఇంకో 5 రన్స్ జోడించి పెవిలియన్ చేరాడు. టెయిలెండర్లు ఫెయిలవడంతో 325 రన్స్ కే ఫుల్ స్టాప్ పెట్టేసింది. మిచెల్ స్టార్క్(3/88 ), ట్రావిస్ హెడ్(2/17), జోష్ హేజిల్ వుడ్(2/71 ) రాణించారు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు సైతం మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వార్నర్(25; 76 బంతుల్లో 2X4), లబుషేన్(30; 51 బంతుల్లో 5X4) తొందరగానే ఔట్ కాగా… మరో వికెట్ పడకుండా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(58; 123 బంతుల్లో 10X4) ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో రాణించిన ఖవాజాకు తోడుగా స్మిత్(6) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్(1/21 ), జేమ్స్ అండర్సన్(1/41) తలో వికెట్ తీశారు.