వరుసగా రెండు టెస్టుల్లో ఓడినా మూడో టెస్టును పట్టుదలతో నెగ్గి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న ఇంగ్లాండ్.. నాలుగో టెస్టులోనూ సత్తా చూపిస్తోంది. డబుల్ సెంచరీ చేజారినా క్రాలీ ధనాధన్ ఆటతీరుతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 317 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్… రెండో రోజు దూకుడైన ఆటను ప్రదర్శించింది. ఓపెనర్ జాక్ క్రాలీ(189; 182 బంతుల్లో 21×4, 3×6) సూపర్ బ్యాటింగ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. మొయిన్ అలీ(54; 82 బంతుల్లో 7×4), జో రూట్(84; 95 బంతుల్లో 8×4, 1×6)తో క్రాలీ మంచి పార్ట్నర్ షిప్స్ నమోదు చేశాడు. హ్యారీ బ్రూక్(14), బెన్ స్టోక్స్(24) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట క్లోజ్ అయ్యే సమయానికి 4 వికెట్లకు 384 పరుగులు చేసిన ఇంగ్లిష్ జట్టు.. 67 రన్స్ లీడ్ లో ఉంది.
8 వికెట్లకు 299 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కంగారూలు.. మరో 18 పరుగులకు చివరి రెండు వికెట్లు కోల్పోయారు. వోక్స్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో ఓపెనర్ బెన్ డకెట్ 1 పరుగుకే వెనుదిరిగినా మరో ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రం తగ్గలేదు. వన్డే తరహా ఆటతీరుతో మళ్లీ ‘బజ్ బాల్’ సిస్టమ్ ను గుర్తుకు తెచ్చాడు. కేవలం 93 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేశాడు. క్రాలీ దూకుడుతో ఇంగ్లాండ్ స్కోరు వేగంగా కదిలింది. 216 బంతుల్లోనే 200 రన్స్ కు చేరుకున్న స్కోరు.. 300 పూర్తి చేయడానికి 318 బంతులే ఆ టీమ్ కు అవసరమయ్యాయి. మొయిన్ తో కలిసి 121 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేసిన క్రాలీ.. రూట్ తో కలిసి మూడో వికెట్ కు 206 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హేజిల్ వుడ్, గ్రీన్ తలో వికెట్ తీసుకున్నారు.