ఒకరిద్దరు సీనియర్ ప్లేయర్లు దూరమైతేనే జట్టం(Team)తా గందరగోళం(Confusion)గా తయారవుతుంది. అలాంటిది ఏడెనిమిది మంది ఒక సిరీస్ కు దూరంగా ఉన్నారంటే ఆ టీమ్ పరిస్థితి ఎలా ఉంటుంది. వాళ్ల స్థానాలు భర్తీ చేయాలంటే అంత ఈజీయేం కాదు. సీనియర్ల ప్లేసెస్ లో జూనియర్లను తీసుకున్నా వాళ్లు ఎలా ఆడుతారోనన్న అనుమానం. ఇంగ్లండ్ తో సిరీస్ లో టీమ్ఇండియాకు ఎదురైన దయనీయ స్థితి ఇది. అయినా ఐదుగురు కుర్రాళ్లతో అరంగేట్రం(Entry) చేయించి అందులో నలుగురి టాలెంట్ తో ఏకంగా 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుని వారెవ్వా అనిపించింది.
అద్భుతం కుర్రాళ్ల ఆట…
మహ్మద్ షమి, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లంతా(Players) ఇంగ్లండ్ తో మ్యాచ్ లకు దూరమయ్యారు. రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, దేవ్ దత్ పడిక్కల్, ఆకాశ్ దీప్.. ఇలా ఐదుగురు కొత్తవారు ఒక సిరీస్ లో ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యకరమే. ఇందులో పటీదార్ మినహా… అంతా సూపర్ గా మెరిశారు. సర్ఫరాజ్ ఖాన్ ఐదు ఇన్నింగ్స్ లాడితే మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. ఇక జురెల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆడిన తొలి టెస్టులోనే పడిక్కల్ ఐదో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో చేసిన 65 పరుగులు ఎంతో విలువైనవి. ఈ ముగ్గురే కాకుండా నాలుగో టెస్టులో బుమ్రా లేని లోటును తీర్చుతూ ఆకాశ్ 3 వికెట్లతో అదరగొట్టడం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
అంతా అలా అలా…
టీమ్ఇండియాకు ఆడాలంటే ఎంతో కసి ఉంటే తప్ప సాధ్యం కాదు అని మొన్నటి మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ అన్నాడు. రోహిత్ చెప్పినదానికన్నా ఎక్కువగా తమలో కసి, తపన ఉన్నాయని ఈ కుర్రాళ్లు తమ ఆటతీరుతోనే చాటిచెప్పారు. నిజంగా ఈ సిరీస్ భారత క్రికెట్ కు ఒక మేలి మలుపు లాంటిదే. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దేవ్ దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఎలా ఆడారో చూశాం. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అన్నట్లు.. చేజారుతున్న పరిస్థితుల్ని గాడిలో పెట్టారు. నిజంగా ఇపుడున్న పరిస్థితి చూస్తే విరాట్, రాహుల్, పంత్ వస్తే పరిస్థితి ఏంటన్నది క్వశ్చన్ మార్క్ గా తయారైంది. కోహ్లి, రాహుల్ వంటి సీనియర్ల ప్లేస్ కు ముప్పు లేకున్నా.. ఈ కుర్రాళ్ల నుంచి ప్రమాదం మాత్రం పొంచి ఉందని చెప్పవచ్చు.