‘సెలక్టర్లు జోకర్లు’… భారత క్రికెట్ సెలక్షన్ కమిటీని ఉద్దేశించి గతంలో ఓ మాజీ స్టార్ ఆటగాడు చేసిన కామెంట్ ఇది. ప్రతిభ(Talent) ఉన్న వారిని కాకుండా దేశవాళీల్లో సరిగా ఆడని వారికి కూడా జాతీయ జట్టులో చోటు(Place) కల్పించడం పట్ల విమర్శలు వస్తుండేవి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటగాళ్లే కాదు.. వారిని తీర్చిదిద్దాల్సిన BCCI కూడా ఛేంజ్ కావాల్సి వచ్చింది. తాజా ఇంగ్లండ్ సిరీస్ లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఒక సిరీస్ లో ఐదుగురు కొత్తవాళ్లకు ఛాన్స్ దక్కిందంటే అది నిజంగా సెలక్టర్ల ఘనతే(Credit)నని చెప్పవచ్చు.
రాహుల్ నోటి నుంచి…
అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీయే ఐదుగురు కొత్త కుర్రాళ్లను ఎంపిక చేస్తూ సాహసోపేత(Dareness) నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కోచ్ ద్రవిడే స్వయంగా తెలియజేశాడు. ‘దేశవాళీల్లో ఎవరెలా ఆడుతున్నారో నిజంగా మాకు తెలియదు.. మేం మా పనిలోనే బిజీగా ఉన్నాం.. కానీ అగార్కర్ టీమ్ మాత్రం ఆ పని సక్సెస్ ఫుల్ గా చేస్తున్నది.. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించిన ఘనత నిజంగా సెలక్టర్లకే దక్కుతుంది’.. అని ద్రవిడ్ కొనియాడాడు. కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ను టీమ్ఇండియాకు తీసుకోవడమే అందుకు ఎగ్జాంపుల్.
వాళ్లే ఎగ్జాంపుల్…
పంత్, ఇషాన్ వంటి మేటి ఆటగాళ్లు లేని టైమ్ లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చి… కష్టాల్లో పడ్డ టీమ్ ను ముందుండి నడిపించి భవిష్యత్ ధోనిగా ప్రశంసలు అందుకున్నాడీ చిన్నోడు. రాంచీ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించి చివరకు భారత్ విజయం సాధించడంలో ధ్రువ్ జురెల్ దే కీలక పాత్రగా నిలిచింది. అందుకే అతడికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక సర్ఫరాజ్ ఖాన్ మూడు హాఫ్ సెంచరీలు సాధిస్తే.. దేవ్ దత్ పడిక్కల్ సైతం టెస్టుల్లో అడుగుపెడుతూనే 65 స్కోరు చేశాడు.