ఫస్ట్ ఓవర్లోనే 19 పరుగులు… రెండో ఓవర్లో 18 రన్స్… 2.4 ఓవర్లోనే టీమ్ స్కోరు 50. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది విధ్వంసం ఎలా ఉందో. ఈ దాడికి బలైంది బుమ్రా సహా ముంబయి ఇండియన్స్(MI) బౌలర్లయితే వారిని బాధితులుగా చేసింది మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఓపెనర్లే(Openers). టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ ఎందుకిచ్చామా అన్న రీతిలో సాగింది ఏకపక్ష(One Side) దాడి.
తుపాను కాస్తా సునామీలా…
తుపాను సునామీగా ఎలా మారుతుందో చూపించాడు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్. 15 బాల్స్ లోనే 8 ఫోర్లు, 3 సిక్స్ లతో 50 మార్క్ దాటిన అతడు… వచ్చిన బంతిని వచ్చినట్లే స్టాండ్స్ లోకి లేదా బౌండరీ లైన్ కు పంపాడు. కొద్దిలో సెంచరీ చేజారిందే కానీ ఫ్రేజర్(84; 27 బంతుల్లో 11×4, 6×6) ఆట మాత్రం అందరినీ అలరించింది. అవతల అభిషేక్ పోరెల్(36; 27 బంతుల్లో 3×4, 1×6) కొద్దిసేపు నిలబడ్డాడు. ఈ ఇద్దరి వీరుబాదుడుకు ప్రతి ఓవర్లోనూ 14కు పైగా రన్ రేట్ వచ్చింది.
భారీ స్కోరు…
షాయ్ హోప్(41; 17 బంతుల్లో 5×6) ట్రిస్టన్ స్టబ్స్(47 నాటౌట్; 24 బంతుల్లో 6×4, 2×6), పంత్(29; 19 బంతుల్లో 2×4, 2×6), అక్షర్(11) అంతా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో DC 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది.