28 బంతుల్లో ఫిఫ్టీ… 31 బాల్స్ లో 66 నాటౌట్… 210 టార్గెట్ లో 113కే 6 వికెట్లు పడ్డ దశలో ఏడో నంబరు ఢిల్లీ బ్యాటర్ గా అడుగుపెట్టాడు అశుతోష్ రాంబాబు శర్మ. అయినా ఓటమి తప్పదనే భావించారంతా. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడీ 26 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. 2024 IPL సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ గానే గ్రౌండ్ లోకి దిగాడు. పంజాబ్ కింగ్స్ అతణ్ని బేస్ ప్రైజ్ ధర రూ.20 లక్షలకు కొనుక్కొంది. తన తొలి నాలుగు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 31(17 బంతుల్లో), 33(15), 31(16), 61(28 బంతుల్లో) చొప్పున స్కోర్లు చేశాడు. అంటే 180 నుంచి 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడన్నమాట.
IPL 2025 మెగా వేలంలో భారీ మొత్తం ఆశించడంతో అతణ్ని అట్టిపెట్టుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపలేదు. దీంతో అశుతోష్ వేలంలోకి రాగా రూ.3.80 కోట్ల భారీ మొత్తంతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దేశవాళీ టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికార్డు శర్మదే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ తరఫున ఆడి అరుణాచల్ ప్రదేశ్ పై 11 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తనపై నమ్మకంతో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన ఢిల్లీ ఆశలు.. అత్యంత ఒత్తిడిలో నిలబెట్టుకుని ఔరా అనిపించాడు.