వరుసగా రెండు విజయాలతో టోర్నీలో ఊపు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్(Defending Champion) చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమిని చవిచూసింది. తొలుత బౌలింగ్ లో పస లేక.. తర్వాత బ్యాటింగ్ లో ఆడలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. ఢిల్లీ తొలుత 5 వికెట్లకు 191 పరుగులు చేస్తే.. చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయి, మరోవైపు వికెట్లు కోల్పోతూనే టార్గెట్ కు CSK దూరంగానే ఉండిపోయింది. 6 వికెట్లకు 171 రన్స్ చేసిన రుతురాజ్ సేన.. 20 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఢిల్లీ టీమ్ లో…
ఓపెనర్లు పృథ్వీషా(43; 27 బంతుల్లో 4×4, 2×6), డేవిడ్ వార్నర్(52; 35 బంతుల్లో 5×4, 3×6), పంత్(51; 32 బంతుల్లో 4×4, 3×6) జోరు చూపించారు. మిచెల్ మార్ష్(18), ట్రిస్టల్ స్టబ్స్(0)ను వరుస బాల్స్ లో పతిరణ బౌల్డ్ చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 7 నాటౌట్, అభిషేక్ పోరెల్ 9 నాటౌట్ గా ఉన్నారు. మతీషా పతిరణ మూడు వికెట్లు తీసుకున్నాడు.
ముకేశ్, ఖలీల్ దెబ్బ…
192 టార్గెట్ తో రంగంలోకి దిగిన రుతురాజ్ సేన… 7 పరుగులకే ఓపెనర్లిద్దరినీ చేజార్చుకుంది. రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) వికెట్లను కోల్పోయింది. ఈ రెండు వికెట్లను ఖలీల్ అహ్మద్ తీసుకోగా.. అతడు తొలి మూడు ఓవర్ల స్పెల్ లో కేవలం 9 పరుగులే ఇచ్చాడు. అజింక్య రహానే(45; 30 బంతుల్లో 5×4, 2×6), డారిల్ మిచెల్(34) ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఫామ్ లో ఉన్న రహానేను ఔట్ చేసిన ముకేశ్ కుమార్… శివమ్ దూబె(18), సమీర్ రిజ్వీ(0) వరుస బాల్స్ లో ఔట్ చేసి CSKను కష్టాల్లోకి నెట్టాడు. చేయాల్సిన రన్ రేట్ 14కు పైగా ఉండటంతో జడేజా, ధోని క్రీజులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన చెన్నై మూడో మ్యాచ్ లో ఓటమి పాలైంది. అటు రెండు మ్యాచ్ లు పోగొట్టుకున్న ఢిల్లీ మూడో మ్యాచ్ లో గెలుపొందింది.