మిడిలార్డర్ బ్యాటర్, గత సీజన్లో అత్యధిక ధర(Highest Rate) పలికిన శామ్ కరణ్ హాఫ్ సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్… టైట్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసింది. తొలుత 6 వికెట్లకు ఢిల్లీ 174 పరుగులు చేస్తే.. 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 స్కోరు చేసి 4 వికెట్లతో విజయాన్ని పంజాబ్ అందుకుంది.
తడబడ్డ బ్యాటింగ్…
ఢిల్లీ టీమ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(29), మిచెల్ మార్ష్(20), షాయ్ హోప్(33), రిషభ్ పంత్(18), రికీ భుయ్(3), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(21), అభిషేక్ పోరెల్(32 నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టం(Tight)గా బంతులేయడంతో బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారింది. అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
శామ్ విజృంభణ…
175 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన పంజాబ్.. ఖలీల్ వేసిన మ్యాచ్ తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లతో 17 రన్స్ పిండుకుంది. శిఖర్ ధావన్(22), జానీ బెయిర్ స్టో(9) తొందరగానే ఔటైనా ప్రభ్ సిమ్రన్ సింగ్(26; 17 బంతుల్లో 5×4) కాసేపు నిలబడ్డాడు. ఫస్ట్ 3 ఓవర్లలో 34 స్కోరు చేసిన పంజాబ్ నాలుగో ఓవర్లో రెండు వికెట్లు చేజార్చుకుంది. మూడు బంతుల తేడాలో ధావన్, బెయిర్ స్టోను ఇషాంత్ శర్మ వెనక్కు పంపాడు. ఆ తర్వాత మొదలైంది శామ్ కరణ్ తుపాను.