కెప్టెన్ రిషభ్ పంత్ ఫటాఫట్ బ్యాటింగ్ తో తొలుత భారీ స్కోరు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్(DC).. ఆ తర్వాత చివరిదాకా పోరాటం చేసిన గుజరాత్ టైటాన్స్(GT) బ్యాటర్లను అడ్డుకుని విజయాన్ని సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ పడుతూ లేస్తూ పరుగులు సాధిస్తూనే విజయం దిశగా వచ్చి చివరకు చేతులెత్తేసింది. తుదకు 8 వికెట్లకు 220 మాత్రమే చేసి 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది.
ఢిల్లీ భళా…
ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా(11), జేక్ ఫ్రేజర్(23) షాయ్ హోప్(5) తొందరగా ఔటవడంతో 44 స్కోరుకే 3 వికెట్లు పడ్డాయి. కానీ అక్షర్ పటేల్(66; 43 బంతుల్లో 5×4, 4×6), పంత్(88 నాటౌట్; 43 బంతుల్లో 5×4, 8×6) దొరికిన బంతిని దొరికినట్టల్లా బాదారు. ఆఖర్లో స్టబ్స్(26; 7 బంతుల్లో 3×4, 2×6) హోరెత్తించడంతో DC భారీ స్కోరు చేసింది.
తర్వాత…
సాహా(39), గిల్(6), ఒమర్జాయ్(1) వికెట్లు పారేసుకున్నా.. సాయి సుదర్శన్(65 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 8×6), మిల్లర్(55 నాటౌట్; 23 బంతుల్లో 6×4, 3×6) రాణించినా చివరి వరుస బ్యాటర్లంతా క్యూ కట్టడంతో GT ఓటమి పాలైంది.