చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ముంబయిపై ఢిల్లీ విజయం సాధించింది. ప్రత్యర్థి విసిరిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అండర్-19 సంచలనం నికీ ప్రసాద్ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించింది. లానింగ్(15), జెమీమా(2), సదర్లాండ్(13), క్యాప్సీ(16) తొందరగానే ఔటయ్యారు. 109కే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీని తొలి మ్యాచ్ ఆడుతున్న నికీ.. దగ్గరుండి నిలబెట్టింది. మొదట షెఫాలి(43; 18 బంతుల్లో 7×4, 2×6) హడలెత్తించినా మిగతా ఎవరూ నిలవలేదు. చివర్లో నికీ ఔటైనా రాధా యాదవ్(9), అరుంధతి(2) టార్గెట్ ను పూర్తి చేశారు.
టెన్షన్ ఇలా…
ఆఖరి ఓవర్లో 10 పరుగులు కావాలి. నాలుగు బంతుల్లో 4, 2, 1, 1 రాగా ఐదో బంతికి నికీ ఔటైంది. ఇక ఒక్క బంతికి 2 రన్స్. అరుంధతి, రాధ జోడీ డబుల్ తీసింది. అయితే సెకండ్ రన్ పూర్తవుతుండగానే ముంబయి కీపర్ వికెట్లను ఎగురగొట్టింది. అది రనౌటేమోనని థర్డ్ అంపైర్ కు నివేదించారు. కానీ నాటౌటని తేలడంతో 2 వికెట్లతో గెలిచిన ఢిల్లీ సంబరాల్లో మునిగిపోయింది.