వచ్చే నెలలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే వేదికలను ప్రకటించగా.. అందులో ఒక పిచ్ పనికిరాదని ఐసీసీ(International Cricket Committee) తేల్చింది. భారత్ లో అక్టోబరు 5 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కావాల్సి ఉండగా.. మొత్తం 10 నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయని BCCI ఇంతకుముందే ప్రకటించింది. అయితే ఇందులో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(HPCA)కు చెందిన ధర్మశాల గ్రౌండ్ పనికిరాదని రిపోర్ట్ తయారు చేసింది. వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న 10 పిచ్ లను ICC హెడ్ పిచ్ కన్సల్టెంట్ అయిన ఆండీ అట్కిన్సన్ సునిశితంగా పరిశీలించి ధర్మశాల మైదానం పనికిరాదని నిర్ధారణకు వచ్చారు. సదరు పిచ్ లో ఫంగస్ వల్ల ఇబ్బందులు ఉంటాయని రిపోర్ట్ లో తెలియజేశారు. ఔట్ ఫీల్డ్ ఆటకు ఏ మాత్రం పనికిరాదని అట్కిన్సన్ గుర్తించినట్లు ICC వర్గాలు అంటున్నాయి.
భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ మరో మూడు వారాల్లో ప్రారంభం కావాల్సి ఉండగా.. ICC పిచ్ ల కమిటీ ఇచ్చిన నివేదిక BCCIని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో అక్టోబరు 22న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 10 జట్లు పాల్గొనే వరల్డ్ కప్ లో ప్రతి జట్టు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మిగతా 9 జట్లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. వచ్చే నెల 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ తో టోర్నీ స్టార్ట్ కానుండగా… తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ లో తలపడతాయి.