ఆడుతున్నది రెండో టెస్టే(Career Second Match) అయినా.. ఆ కుర్రాడు అసమాన పోరాటాన్ని చూపించాడు. 177కే 7 వికెట్లు పడ్డ జట్టును అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు. ప్రత్యర్థి 353 పరుగుల స్కోరు చేస్తే అందులో సగం కూడా చేయకుండానే కీలక వికెట్లు కోల్పోయిన టీమ్ ను చూసి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అలా ధ్రువ్ జురెల్ పట్టుదలగా ఆడటంతో టీమ్ఇండియా పోరాటం కొనసాగించింది. ‘ధ్రువ్ తార’లా జురెల్ కొనసాగించిన పోరాటంతో భారత్ జట్టు… ఇంగ్లండ్ కు దీటుగా బదులిచ్చింది. చివరకు అతడు(90; 149 బంతుల్లో 6×4, 4×6) సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
76 రన్స్ పార్ట్నర్ షిప్…
ఈ సిరీస్ తోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి మూడో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో కలిసి జట్టును ఒడ్డుకు చేర్చాడు. 200 లోపే ఆలౌట్ అవుతుందేమోనన్న అనుమానాల నడుమ జురెల్-కుల్దీప్ చూపిన పోరాటం.. భారత్ ను 250 స్కోరు దాటించింది. ఈ జోడీ ఎనిమిదో వికెట్ కు 76 పార్ట్నర్ షిప్(Partnership) అందించింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వగకుండా ఆడిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా కుల్దీప్ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు. చివరకు కుల్దీప్(28) అండర్సన్ బాల్ కు బౌల్డయ్యాడు.
తొమ్మిదో వికెట్ కు సైతం…
253 స్కోరు వద్ద కుల్దీప్ ఔటైనా జురెల్ పట్టు వదల్లేదు. ఆకాశ్ దీప్(9)తోనూ తొమ్మిదో వికెట్ కు 40 పరుగులు జత చేశాడు. తర్వాత ఆకాశ్ కూడా ఔటయ్యాడు. మూడో రోజు లంచ్ విరామం వరకు పడ్డ రెండు వికెట్లలో ఒకటి అండర్సన్ కు, మరొకటి బషీర్ కు దక్కింది. ఈ వికెట్ తో షోయబ్ బషీర్ తన కెరీర్ లో తొలిసారిగా 5 వికెట్ల హాల్ ను అందుకున్నాడు. సిరాజ్ అండగా ధ్రువ్ జురెల్.. టీమ్ఇండియాను 300 మార్క్ ను దాటించాడు. భారత్ 307కు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ కు 46 పరుగుల లీడ్ దక్కింది.