యాషెస్ మూడో టెస్టు నువ్వానేనా అన్నట్లు సాగుతూ రసవత్తర సీన్స్ ను తలపిస్తోంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న సంతోషం నిలవకముందే… ఇంగ్లాండ్ అంతకన్నా Low స్కోర్ కే ఆలౌటయింది. ఆసీస్ తరహాలోనే ఇంగ్లీష్ జట్టుకు ఏకైక బ్యాటరే దిక్కయ్యాడు. ఆట రెండో రోజు 3 వికెట్ల నష్టానికి 68 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్… టాప్ ఆర్డర్ ఫెయిలవడంతో చకచకా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 237 పరుగులకే చాప చుట్టేసి 26 పరుగుల స్వల్ప Leadను ఆస్ట్రేలియాకు కట్టబెట్టింది.
ఇక రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే జో రూట్(19) కమిన్స్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో(12) సైతం స్టార్క్ బౌలింగ్ లో స్మిత్ కు చిక్కి పెవిలియన్ దారి పట్టాడు. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ బెన్ స్టోక్స్(80; 108 బంతుల్లో 6×4, 5×6) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రెండో టెస్టు తరహాలోనే దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తూ గొప్ప పోరాటం చేశాడు. అయితే స్టోక్స్ కు సపోర్ట్ గా నిలిచేవారే కరవయ్యారు. మొయిన్ అలీ(21), క్రిస్ వోక్స్(10), మార్క్ వుడ్(24) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఆతిథ్య జట్టు స్టోరీ ఎండ్ అయింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్(6/91).. ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. అద్భుత బంతులతో బెంబేలెత్తించిన కమిన్స్ కు స్టార్క్(2/59) అండగా నిలవగా… మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ తలో చేయి వేశారు.
26 రన్స్ తొలి ఇన్నింగ్స్ లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు చుక్కలు కనపడ్డాయి. ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) పరుగుకే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(43), మార్నస్ లబుషేన్(33) కాసేపు క్రీజులో నిలిచారు. స్మిత్ కూడా(2) తక్కువ స్కోరుకే ఔటవడంతో… ఆస్ట్రేలియా 80 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 4 వికెట్లకు 116 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(18), మిచెల్ మార్ష్(17) క్రీజులో ఉండగా… టోటల్ గా కంగారూల లీడ్ 142 పరుగులకు చేరుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీ 2, వోక్స్ 1, బ్రాడ్ 1 వికెట్లు తీసుకున్నారు.