యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు దీటుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. సెకండ్ డే ఆట కంప్లీట్ అయ్యే సరికి 61 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. బెన్ డకెట్(98; 134 బంతుల్లో 9X4) రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (45 బ్యాటింగ్; 51 బంతుల్లో 4X4) తోడుగా కెప్టెన్ బెన్ స్టోక్స్(17) క్రీజులో ఉన్నాడు. బజ్ బాల్ తరహా ఆటతీరుతో తొలి టెస్టులో ధనాధన్ బ్యాటింగ్ చేసి చతికిలపడ్డ ఇంగ్లీష్ టీమ్… రెండో టెస్టులో ప్రత్యర్థిపై లీడ్ సాధించేలా చూసుకుంటోంది. ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హేజిల్ వుడ్, లైయన్, గ్రీన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ మరో 138 పరుగులు వెనుకబడి ఉంది.
శతకం బాదిన స్మిత్
5 వికెట్ల నష్టానికి 339 రన్స్ తో రెండో రోజు ఆట కంటిన్యూ చేసిన ఆసీస్… సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీ(110; 184 బంతుల్లో 15X4)తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ జట్టు ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్(77; 73 బంతుల్లో 14X4), డేవిడ్ వార్నర్(66; 88 బంతుల్లో 8X4, 1X6) రాణించారు. కామెరూన్ గ్రీన్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీతోపాటు చివరి వరుస బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టడంతో తొందరగానే కంగారూల కథ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ (3/98), రాబిన్ సన్ (3/100) రాణించారు. జో రూట్ (2/19), జేమ్స్ అండర్సన్ (1/53), స్టూవర్ట్ బ్రాడ్ (1/99) చొప్పున వికెట్లను ఖాతాలో వేసుకున్నారు.