
నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ కు ఓటమి తప్పలేదు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 93 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 9 వికెట్లకు 337 రన్స్ చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ 43.3 ఓవర్లలో 244 రన్స్ కే చేతులెత్తేసింది. 191కి 9 వికెట్లు కోల్పోయిన జట్టుకు హారిస్ రవూఫ్(35), మహ్మద్ వసీమ్(16) చివరి వికెట్ కు 53 రన్స్ జోడించి ఆ మాత్రమైనా స్కోరు అయ్యేలా చూశారు. ఇప్పటికే ఈ రెండు జట్లు ఇంటి బాట పట్టాయి.
రెండు జట్లలో టాప్ ఆర్డరే తేడా
ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు తేడా టాప్ ఆర్డరే. ఇంగ్లండ్ మెయిన్ బ్యాటర్లంతా రాణిస్తే, పాకిస్థాన్ ప్లేయర్లు ఫెయిలయ్యారు. మలన్(31), బెయిర్ స్టో(59), రూట్(60), స్టోక్స్(84), బట్లర్(27), బ్రూక్(30) నిలకడగా ఆడారు. టార్గెట్ ఛేదనలో పాకిస్థాన్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. షఫీఖ్(0), జమాన్(1), అజామ్(38), రిజ్వాన్(36), షకీల్(29) విఫలం కాగా.. ఆగా సల్మాన్(51) మాత్రం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 5 బంతుల్లో 15 రన్స్ తోపాటు 3 వికెట్లు తీసిన డేవిడ్ విల్లేకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.