
ఇప్పటికే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్(England).. నామమాత్ర మ్యాచ్ లో నెదర్లాండ్స్(Netherlands) పై భారీ విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉన్న ఆ జట్టు ఇప్పుడు 10 నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. పుణెలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్ సెంచరీతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 రన్స్ చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 37.2 ఓవర్లలో 179కి ఆలౌటై 160 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
పరువు కాపాడుకున్న బట్లర్ సేన
7 మ్యాచ్ ల్లో 6 ఓటములతో పరువు పోగొట్టుకున్న ఇంగ్లండ్.. ఈ మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది. బెన్ స్టోక్స్(108; 84 బంతుల్లో 6×4, 6×6), డేవిడ్ మలన్ (87; 74 బంతుల్లో 10×4, 2×6), క్రిస్ వోక్స్(51; 45 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో బట్లర్ సేన భారీ స్కోరు చేసింది. డచ్ బౌలర్లలో డి లీడ్ 3, ఆర్యన్ దత్, వాన్ బీక్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ లో తేజ నిడమనూరు(41)దే హయ్యెస్ట్ స్కోర్. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో 3 వికెట్లు తీయడంతో ఆ టీమ్ తక్కువ స్కోరుకే ఆలౌటయింది. స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.