భారత్ పై ఆధిక్యం సాధించామని భావించిన ఇంగ్లండ్ ను టీమ్ఇండియా బౌలర్లు దెబ్బకు దెబ్బ తీశారు. స్పిన్నర్లు పోటీపడి మరీ వికెట్లు తీయడంతో ఆ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 145కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 46 లీడ్ తో ఇంగ్లండ్ 191 పరుగులతో ఉండగా.. 192 పరుగుల టార్గెట్ ను భారత్ ఛేదించాల్సి ఉంది. అశ్విన్ 5 వికెట్లు కుల్దీప్ 4 వికెట్లు తీసుకుంటే, జడేజా ఒకటి దక్కించుకున్నాడు.
క్రాలీ మినహా…
ఓపెనర్ జాక్ క్రాలీ(60) మినహా ఎవర్నీ కుదురుకోనివ్వలేదు భారత బౌలర్లు. డకెట్(15), పోప్(0), రూట్(11), బెయిర్ స్టో(30), స్టోక్స్(4), ఫోక్స్(17) అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. రన్స్ తీయకున్నా ఫోక్స్ మాత్రం చివరి వరుస బ్యాటర్లతో కాసేపు అడ్డుగా నిలిచాడు. అనంతరం టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
అశ్విన్ మరో రికార్డు…
సొంతగడ్డపై అత్యధిక వికెట్లు తీసుకున్న రికార్డును అందుకున్నాడు అశ్విన్. ఇప్పటిదాకా అనిల్ కుంబ్లే భారత గడ్డపై 350 వికెట్లు తీస్తే.. 351తో అశ్విన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచ రికార్డు చూస్తే ముత్తయ్య మురళీధరన్, జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు. ఇదే టెస్టులో 500 వికెట్ల మార్క్ ను అందుకున్న అతడు.. రెండో ఇన్నింగ్స్ లోనూ సత్తా చూపించాడు.