
గెలుపు అంచుల దాకా చేరుకున్న ఇంగ్లాండ్ కు చివరకు నిరాశే ఎదురైంది. మరో 5 వికెట్లు తీస్తే విజయం దక్కుతుందని భావించిన ఆ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం వల్ల ఐదో రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి తప్పించుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. చివరి రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మిచెల్ మార్ష్(31), కామెరూన్ గ్రీన్(3) క్రీజులో ఉన్నారు. ఇక మెయిన్ బ్యాటర్లు మార్ష్, గ్రీన్, క్యారీ మాత్రమే మిగిలారు. దీంతో గెలుపుపై ఇంగ్లీష్ జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ వరుణుడు ఏ మాత్రం శాంతించకపోవడంతో అంపైర్లు ‘డ్రా’గా ప్రకటించారు. ఈ పరిణామంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర ఆవేదనలో మునిగిపోయాడు. గెలిచే మ్యాచ్ ను పోగొట్టుకోవడంతో ఆ జట్టు ప్లేయర్స్ నిరాశకు గురయ్యారు.

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 317 పరుగులు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 592 రన్స్ చేసి 275 పరుగుల లీడ్ సాధించింది. ఇంగ్లాండ్ ను చేరుకోవడానికి మరో 61 రన్స్ అవసరమైన దశలో ఆట నిలిచిపోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 189 పరుగులు చేసిన ఓపెనర్ జాక్ క్రాలీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. 5 మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది.