Published 21 Dec 2023
ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా.. ట్రోఫీ వేట కోసం మూడో వన్డేలో తలపడుతున్నాయి. పార్ల్ లోని బోలాండ్ పార్క్ మైదానంలో జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కుతుంది. ఇప్పటివరకు ఈ రెండు టీమ్ లు 15 ద్వైపాక్షిక సిరీస్ ల్లో పాల్గొంటే 7-6తో టీమిండియా లీడ్ లో ఉంది. ఈ సిరీస్ గెలవడం ద్వారా టీమిండియాను సమం చేసే అవకాశం సౌతాఫ్రికా ముంగిట నిలిచింది. ఇక ఈ చివరి మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో మార్పులు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. సంజూ శాంసన్ వరుసగా ఫెయిల్ అవుతుండటంతో రజిత్ పటిదార్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్ దక్కుతుందా అన్నది తెలియాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి 8 ఏళ్లవుతున్నా ఇప్పటిదాకా కేవలం 16 వన్డేలే ఆడాడంటే కేరళ క్రికెటర్ సంజూ ఫామ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సాయి సుదర్శన్ బాగా రాణిస్తుంటే రుతురాజ్ మాత్రం వరుసగా రెండు వన్డేల్లో విఫలమయ్యాడు. తిలక్ వర్మ సైతం తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంది.
మొదట బ్యాటింగ్ చేస్తే…
బోలాండ్ పార్క్ లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలుండగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరో 5 వికెట్లు తీస్తే వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 భారత బౌలర్ల లిస్టులో కుల్దీప్ చేరిపోతాడు. ఇప్పటివరకు కుల్దీప్ 103 మ్యాచ్ ల్లో 168 వికెట్లు తీస్తే.. ప్రస్తుతం 10వ ప్లేస్ లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ 120 మ్యాచ్ ల్లో 173 వికెట్లతో ఉన్నాడు. అటు మరో 3 పరుగులు పూర్తి చేస్తే మార్ క్రమ్ ఈ క్యాలెండర్ ఇయర్ లో 1,000 రన్స్ కంప్లీట్ చేస్తాడు. అతడు తొలిసారి ఈ ఘనతను అందుకోబోతున్నాడు. సాయంత్రం నాలుగున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది.