భారత్-శ్రీలంక తలపడే ఆసియా కప్ ఫైనల్(Asia Cup Final) కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నాడు నిర్వహిస్తారు. ఈ విధానాన్ని మొన్నటి భారత్-పాక్ మ్యాచ్ కు అమలు చేశారు. కొలంబోలో ఆసియా కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సూపర్-4లో పాక్, లంకపై గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టిన టీమ్ఇండియా.. బంగ్లా చేతిలో ఓటమి పాలైంది. అయితే నలుగురు సీనియర్ల గైర్హాజరీలో ఈ మ్యాచ్ జరిగినా.. బంగ్లా చేతిలో ఓటమి మన నిర్లక్ష్యాన్ని చాటింది. అటు శ్రీలంక సొంతగడ్డపై బలంగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ పై ఆ జట్టులో వెల్లాలగె, చరిత్ అసలంక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ తో మ్యాచ్ లో వెల్లాలగె 5, అసలంక 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ లో భారత జట్టు పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతుంది. మరో మూడు వారాల్లోనే వన్డే వరల్డ్ కప్ ఉన్నందున ఆ లోపు ఆసియా కప్ ట్రోఫీ దక్కించుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటివరకు ఆసియా కప్ లో అత్యధికంగా భారతే 7 ట్రోఫీలు గెలుచుకుంది. 6 కప్పులతో శ్రీలంక రెండో స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.