
Published 02 DEC 2023
వరల్డ్ కప్ ఫైనల్ లో అనూహ్య ఓటమి ఎదురైనా అదే జట్టుపై టీ20 కప్పు గెలుచుకుని ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన టీమిండియా.. ఇప్పుడు ఆధిక్యాన్ని మరింత పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. 5 మ్యాచ్ ల టోర్నీలో 3-1తో కప్పు గెలుచుకున్న భారత్.. ఇప్పుడు ఆధిక్యాన్ని 4-1 లేదంటే 3-2కు పరిమితం చేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఫైనల్ టీ20కి ఒకట్రెండు మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ కు పోటీగా తిలక్ వర్మ ఉండగా, అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా అన్నది తెలియాలి. ఇక బ్యాటింగ్ లో యశస్వి దూకుడు మామూలుగా లేదు. తొలి 6 ఓవర్లలో జైస్వాల్ స్ట్రైక్ రేట్ 174.62గా ఉందంటే బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జైస్వాల్ ఔటైతే తొలి 6 ఓవర్లలో రన్ రేట్ బాగా తక్కువగా ఉంటోంది. 194.11 స్ట్రైక్ రేట్ తో ట్రావిస్ హెడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. జైస్వాల్ అతడి వెనుకే ఉన్నాడు.
ఇక నాలుగో టీ20కి ఐదుగురు ప్లేయర్లను మార్చిన ఆసీస్.. మొత్తంగా ఈ సిరీస్ లో 19 మందితో ప్రయోగాలు చేసింది. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ స్పిన్ ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియన్లు తడబడ్డారు. ఆ జట్టు బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తున్నా రన్స్ ను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. భారత కుర్రాళ్ల బ్యాటింగ్ ముందు ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోతున్నారు. ముఖ్యంగా స్టార్టింగ్ లో జైస్వాల్, రుతురాజ్.. మిడిల్ లో సూర్యకుమార్, జితేష్, రింకూ ఇలా అందరూ ఒకరు కాకుంటే మరొకన్నట్లుగా అడుతుండటంతో భారత్ బ్యాటింగ్ కు ఇబ్బందుల్లేకుండా పోయాయి. ఇవాళ జరిగే మ్యాచ్ మరింత ఆధిక్యాన్నిస్తుందా, లేక ఆసీస్ పరువు నిలుపుతుందా అన్నది చూడాల్సి ఉంది.