Published 21 Dec 2023
అతను ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లయింది.. కానీ ఆడింది కేవలం 16 వన్డేలే.. జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నా నిలకడగా ఆడిందీ లేదు.. భారీ స్కోర్లు చేసిందీ లేదు. అనవసరంగా తీసుకుంటున్నారన్న విమర్శల దృష్ట్యా చివరకు అతడి ముఖంలో నవ్వు కూడా పోయింది. కానీ అలాంటి ఆటగాడే కెరీర్ లో తొలి సెంచరీ సాధించడంతో జట్టు ఏకంగా కప్పును సొంతం చేసుకుంది. ఆ ఆటగాడు సంజూ శాంసన్ అయితే.. ట్రోఫీ గెలిచింది భారత జట్టు. దక్షిణాఫ్రికాతో పార్ల్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్ రౌండ్ షో చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాహుల్ సేన.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218కే ఆలౌటయి 78 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
బ్యాటింగ్ కు ఇరుసులా ఇద్దరు..
భారత బ్యాటింగ్ తొలుత తడబడ్డా మిడిలార్డర్ రాణింపుతో పుంజుకుంది. గత రెండు మ్యాచ్ ల హాఫ్ సెంచరీల హీరో సాయి సుదర్శన్(10) తక్కువకే ఔట్ కాగా.. ఉన్నంత సేపు మరో ఓపెనర్ రజత్ పటీదార్(22; 16 బంతుల్లో, 3×4, 1×6)తో ప్రతాపం చూపించాడు. ఆడతున్నది తొలి మ్యాచే అయినా ఎంతో సీనియర్ లా షాట్లతో అలరించాడు. వన్ డౌన్ లో వచ్చిన సంజూ(108; 114 బంతుల్లో 6×4, 3×6) సెంచరీతో అలరించగా, కెప్టెన్ రాహుల్(21) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కానీ తిలక్ వర్మ(52; 77 బంతుల్లో 5×4, 1×6) అండతో శాంసన్ విజృంభించాడు. చివర్లో రింకూసింగ్(38; 27 బంతుల్లో 3×4, 2×6), వాషింగ్టన్(14) బాదడంతో భారత్ భారీ టార్గెట్ ను ఉంచింది.
జోజి రాణించినా… తడబాటు
గత మ్యాచ్ లో సెంచరీతో టీమ్ ను గెలిపించిన డి జోజి(81; 87 బంతుల్లో 6×4, 3×6) ఈ వన్డేలోనూ సెంచరీ దిశగా సాగాడు. కానీ అవతలి ఎండ్ లో నిలిచేవారే లేక ఒంటరయ్యాడు. హెండ్రిక్స్(19), డసెన్(2), మార్ క్రమ్(36), క్లాసెన్(21), మిల్లర్(10) ఇలా అందరూ విఫలమయ్యారు. ముందుకు డైవ్ చేస్తూ గాల్లోనే అద్భుతమైన క్యాచ్ తో క్లాసెన్ ను వెనక్కు పంపించిన సాయి సుదర్శన్ ఫీట్.. సిరీస్ కే హైలెట్ గా నిలిచింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1తో దక్కించుకుంది.