ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు(Players).. ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. IPLలో అడుగుపెడుతూనే బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ విజృంభించడంతో RCB కోలుకోలేకపోయింది. అతడి గణాంకాలు(1.4-0-6-4) చూస్తేనే ఎలా ఆడుకున్నాడో అర్థమవుతుంది. 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. 78కి చేరుకునేసరికి ఐదు వికెట్లు చేజార్చుకుంది.
ఓపెనర్లు ఫర్వాలేదనిపించినా…
ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(21; 20 బంతుల్లో 1×6), ఫెఫ్ డుప్లెసిస్(35; 23 బంతుల్లో 8×4) ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో బాగా ఆడుతున్నట్లు కనిపించారు. ముఖ్యంగా దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డుప్లెసిస్ నాలుగు ఫోర్లు బాదాడు. కానీ డుప్లెసిస్ ఔట్ కావడానికి తోడు ఆ వెంటనే రజత్ పటీదార్(0), సైతం ముస్తాఫిజుర్ కే దొరికిపోయాడు. అటు గ్లెన్ మాక్స్ వెల్(0)ను ఖాతా తెరవనీయకుండానే చాహర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే కామెరాన్ గ్రీన్(18) ముస్తాఫిజుర్ సూపర్ బాల్ కు బౌల్డయ్యాడు.
రావత్-కార్తీక్ జోడీతో…
ఐదు వికెట్లు పడ్డ టీమ్ ను మరింత కష్టాల్లోకి నెట్టకుండా కీపర్ అనూజ్ రావత్-దినేశ్ కార్తీక్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరిదే హయ్యెస్ట్ పార్ట్నర్ షిప్ కావడంతో RCB కోలుకుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ కు చెందిన కుర్ర వికెట్ కీపర్ రావత్ బ్యాట్ తో దడదడలాడించాడు.