Published 11 Jan 2024
బ్యాటింగ్ లో తడబడ్డా అఫ్గానిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో భారత జట్టే(Bharath Team) విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబె హాఫ్ సెంచరీతో విజృంభించడంతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ భాగంగా మొహాలిలో జరిగిన టీ20లో టాస్ గెలిచిన రోహిత్.. ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 158 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. తొలుత తడబడ్డా మిడిలార్డర్ ఆదుకోవడంతో సొంతగడ్డపై మన జట్టుదే పైచేయి అయింది. దూబె ఫైనల్ టచ్ తో మరో 15 బాల్స్ మిగిలుండగానే 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది.
అంతంతమాత్రంగానే అఫ్గాన్
అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42)దే అత్యధిక(Highest) స్కోర్. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్(23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్(25), అజ్మతుల్లా ఒమర్ జాయ్(29) రాణించడంతో ఆ జట్టు తక్కువ స్కోరే చేసింది. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ రెండేసి చొప్పున దూబె ఒక వికెట్ తీసుకున్నారు. 57కే మూడు వికెట్లు కోల్పోయిన టీమ్ ను ఒమర్ జాయ్, మహ్మద్ నబీ పట్టాలెక్కించారు.
శివమ్ శివాలు…
మామూలు లక్ష్య ఛేదనతో రంగంలోకి దిగిన భారత్.. కెప్టెన్ రోహిత్(0) వికెట్ ను వెంటనే కోల్పోయింది. శుభ్ మన్ గిల్(23), తిలక్ వర్మ(26) కాసేపు నిలబడ్డారు. 72 స్కోరుకే 3 వికెట్లు పడిపోవడంతో అఫ్గాన్ పట్టు సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ శివమ్ దూబె(60; 40 బంతుల్లో 5×4, 2×6) ఆటాడుకోవడంతో విజయవంతంగా భారత ఇన్నింగ్స్ ముగిసింది. 60 రన్స్ తోపాటు ఒక వికెట్ తీసి విజయానికి కారణంగా నిలిచిన శివమ్ దూబె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.