Published 28 Dec 2023
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. ఇన్నింగ్స్ 32 పరుగులతో ఓటమి పాలైంది. సెంచూరియన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆతిథ్య జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 408 రన్స్ చేసి 163 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ సేన 131కే చతికిలపడి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం భారత జట్టు ఆటతీరుకు అద్దం పట్టింది.
కోహ్లి శ్రమ వృథా..
163 రన్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ వైఫల్యం ఇబ్బందికరంగా మారింది. రోహిత్(0) డకౌట్ గా వెనుదిరిగితే మరో ఓపెనర్ జైస్వాల్(5) సైతం అతణ్నే ఫాలో అయ్యాడు. కొద్దిసేపు నిలబడ్డ గిల్(26) కోహ్లి(76)కి సహకారమందించే లోపే ఔటయ్యాడు. శ్రేయస్(6), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రాహుల్(4) వెంటవెంటనే అవుటవడంతో కథ ముగింపు దశకు చేరుకుంది. అశ్విన్(0), ఆల్ రౌండర్ గా ప్లేస్ దక్కించుకున్న శార్దూల్(2) టపటపా వికెట్లు సమర్పించుకోవడంతో భారత్ కు ఘోర పరాజయం మిగిలింది.
రబాడ వలలో రోహిత్
ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో రోహిత్ శర్మ ఫెయిల్ కావడం ఒకెత్తయితే.. వరుసగా రబాడ చేతిలో కంగుతినడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రబాడకే వికెట్ సమర్పించుకున్న భారత కెప్టెన్.. దక్షిణాఫ్రికాతో ఆడిన 11 ఇన్నింగ్స్ లో 7 సార్లు రబాడకు వికెట్ సమర్పించుకున్నాడు. ముగ్గురు సీమర్లు విజృంభించడంతో భారత్ వద్ద జవాబే లేకుండా పోయింది. బర్గర్ 4, యాన్సెన్ 3, రబాడ 2 వికెట్లు తీసుకున్నారు. సెంచరీ చేసి భారీ స్కోరుకు బాటలు వేసిన డీన్ ఎల్గర్(185)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.